మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని తన నివాసంలో 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి ఆవరణలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించారు. పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
అనంతరం తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న సుమారు 100 మంది నిరుపేదలకు నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.