ఈనెల 24 నుంచి 13 రోజుల పాటు జరగనున్న జగిత్యాల జిల్లా ధర్మపురి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వల్ల గోదావరి నదిలో భారీగా నీరు నిలవడంతో స్నానాలు చేసేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
రోజుకు 12 లక్షల లీటర్ల మంచినీటి లభ్యత ఉన్నా.. ధర్మపురిలో నీటికొరతను గుర్తించామని, అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేసి భక్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని మంత్రి కొప్పుల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించడం కోసం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకు శానిటేషన్ సిబ్బందిని నియమించాలని చెప్పారు. భద్రతా చర్యలపై ఎస్పీ సింధూశర్మ పోలీసులకు పలు సూచనలు చేశారు. విద్యుత్, ప్రజారోగ్యం, తదితర విషయాలపై కలెక్టర్ రవి సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
- ఇదీ చూడండి : మనతోనే మహేశ్వరుడు.. మనలోనే నీలకంఠుడు!