మున్సిపల్ కార్యాలయాల్లో పనులు పారదర్శకంగానే జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోన్నా.. అవన్నీ వట్టి మాటలేనని జగిత్యాల మున్సిపల్ ఆఫీస్‌ను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పైసలు లేనిదే ఏ పని జరగదు. చేతులు తడపందే ఏ ఫైలు ముందుకు కదలదు. తాజాగా భవన నిర్మాణం అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి రూ. 95వేలను లంచం తీసుకుంటూ.. ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారంటే, అక్కడ అవినీతి ఏ మేరకు సాగుతుందో తెలుసుకోవచ్చు.
జగిత్యాల.. జిల్లా కేంద్రంగా మారిన అనంతరం అక్కడ నిర్మాణ రంగం పుంజుకుంది. పట్టణంలో లక్షా 30వేలకు పైగా జనాభా నివసిస్తుండగా.. క్రమక్రమంగా ఇక్కడకు వలస వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లే నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి. భవన నిర్మాణాల అనుమతి కోసం టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లోనే అనుమతులు పొందాల్సి ఉండగా.. ఇక్కడవేమి పని చేయవు. పని కోసం కార్యాలయాలకే తప్పక వెళ్లాల్సి వస్తోంది.
ప్రతీ పనికి ఇంతా.. అనే రీతిలో కాసులు చెల్లిస్తేనే పనులు జరుగుతాయని బాధితులు చెబుతున్నారు. అనుమతులే కాదు.. ప్రతి ఫైలుకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని వాపోతున్నారు. ఇంత అవినీతి ముపెన్నడూ లేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు.
భవన నిర్మాణ అనుమతుల విషయాల్లోనే కాదు.. టెండర్లలోనూ సింగిల్ టెండర్లు వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తోంది. తాత్కలిక ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. అధికారులు, పాలక మండలి ప్రజా సమస్యల కోసం పాటు పడేలా ఉండాలి.
దుర్గయ్య, మున్సిపల్ కౌన్సిలర్.
ఇదీ చదవండి: తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్ హల్ చల్