Kondagattu Temple Lands Occupied: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కబ్జాదారులు ఆక్రమించుకున్న భూముల్లో యథేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి కొడిమ్యాల, మల్యాల మండలాల పరిధిలో 45ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి విలువ కోట్ల రూపాయాలు పలుకుతోంది. కొండగట్టు గుట్ట ప్రాంతంలో రెవెన్యూ శాఖ అధీనంలో 333 ఎకరాల స్థలం ఉంది.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా?: అయితే ఆ భూములకు హద్దులు నిర్ణయించలేదు. దీంతో అందులో ప్రైవేట్ వ్యక్తులు పక్కా భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూముల్ని రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కబ్జాదారులకు ఎదురులేకుండా పోతోందని భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకొనేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు రాజకీయ ఒత్తిళ్లతో నీరుగారి పోయాయని అందుకే వాటిని పట్టించుకోవడం మానేశారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి: ఆలయానికి సంబంధించిన భూమి అయినప్పటికీ.. కొంతమంది వ్యక్తులు ఏళ్ల క్రితమే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి.. వెనువెంటనే సర్వే నిర్వహించి భూములు తమ అధీనంలోకి తీసుకొంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటి వరకు అనేక ఫిర్యాదులు అందినప్పటికీ సర్వే చేయించడానికి మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో సరైన సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు.
భూముల సర్వే నిర్వహిస్తాం: ఇప్పటికే కార్యాలయంలో విధులు నిర్వర్తించే సర్వేయర్‌ను.. జాతీయ రహదారి విస్తరణ తదితర పనులపై డిప్యూటేషన్‌పై పంపుతుండటంతో సర్వే పనులు పెండింగ్‌లో పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. సర్వే చేసి కంచె ఏర్పాటు చేయకపోతే.. విలువైన భూములు కబ్జాలకు గురవుతాయని భక్తులు వాపోతున్నారు. కొండగట్టు స్టేజీ వద్ద ఆలయ భూములు ఆక్రమణకు గురైనట్లు ఆలయ ఈఓ వెంకటేశ్ అంగీకరించారు. అయితే భూములు సర్వే జరిపించాలని రెవెన్యూ అధికారులకు పలుమార్లు లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. సర్వే నిర్వహించి సరిహద్దులు నిర్దారిస్తూ శాశ్వత కంచెను ఏర్పాటు చేస్తామని ఈఓ వెంకటేశ్ స్పష్టం చేశారు.
"ప్రభుత్వ రికార్డుల ప్రకారం దేవాలయానికి 400 ఎకరాలు ఉన్నాయి. అదే విధంగా రూ.100 కోట్లు అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించామని చెప్పారు. కానీ భూములకు హద్దులు లేవు. తద్వారా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికైనా సర్కార్ స్పందించి చర్యలు చేపట్టాలి." - సత్యనారాయణరావు, బీజేపీ అధ్యక్షుడు జగిత్యాల జిల్లా
"కొండగట్టులో సుమారు 400 ఎకరాలకుపైనే భూమి ఉంది. కానీ ఇప్పుడు 100 ఎకరాలు కూడా లేదు. రియల్ఎస్టేట్ వెంచర్ల పేరుతో కబ్జాలు చేస్తున్నారు." -మదన్‌మోహన్, స్థానికుడు
ఇవీ చదవండి: 'రైతుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్.. అభ్యంతరాలు స్వీకరించాలని సూచన
కొవిడ్ కలవరం.. భారత్‌కు వచ్చిన ఆ ప్రయాణికుల్లో 11 రకాల వేరియంట్లు