Kondagattu temple: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్న సన్నిధికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణంలో, ప్రకృతి సోయగాల మధ్య కొండపై వెలిసిన ఆంజనేయ స్వామి దేవస్థానానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఏటా చైత్రపౌర్ణమి రోజు నిర్వహించే చిన్న హనుమాన్ జయంతి, పూర్వాభాద్ర నక్షత, వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతికి లక్షల్లో భక్తులు తరలివస్తారు. ప్రతీ మంగళవారం, శనివారం భక్తులు పోటెత్తుతారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఆలయాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఏటా గుడికి 20 కోట్ల ఆదాయం వస్తుండగా నిర్వహణ, జీతభత్యాలు పోను 12 కోట్లు మిగులుతుంటాయి. ఇంత ఆదాయమున్నా సౌకర్యాల కల్పనలో మాత్రం తీసికట్టుగానే ఉంది. కొండపై వసతి లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 200 గదులు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. రాత్రివేళ కొండపై తలదాచుకునే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి వెళ్లే ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తాపడి 65మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పొయినా ఇప్పటివరకు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. భారీ వాహనాల రాకపోకలను నిషేధించి చేతులు దులుపుకున్నారు. రోడ్డును బాగు చేయించి మరో ఘాట్‌రోడ్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. ఏటా వేసవిలో తాగునీటికి కటకట ఏర్పడుతోంది. హనుమాన్ జయంతి ఉత్సవాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. గుడి చుట్టూ నీడకోసం షెడ్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మూత్రశాలలు, స్నానాల గదులు లేకపోవడం యాత్రికుల సహనానికి పరీక్షగా మారింది. 25న హనుమాన్ జయంతి వరకైనా యుద్ధప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా యాదాద్రి తరహాలో శాశ్వతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'అమిత్ షా తన పేరును అబద్దాల బాద్షా అని మార్చుకోవాలి'