KCR jagtial Tour: తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రమవుతుందని ఆనాడే చెప్పానని సీఎం కేసీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న కేసీఆర్... తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 50కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అందరికీ ప్రయోజనాలు అందేలా పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు చాలా అనిశ్చిత పరిస్థితి ఉందని అన్నారు. క్రమక్రమంగా అన్నీ అర్థం చేసుకుని అంచనాలు వేసుకున్నామని స్పష్టం చేశారు. నేడు ఎన్నో అంశాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. ఇవాళ దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
గురుకుల విద్యాలయాల్లో తెలంగాణకు పోటీయే లేదు. కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నాం. జిల్లాల విభజనపై కొందరు విమర్శలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు. రైతుబంధు పరిమితిపైనా అభ్యంతరాలు చెప్తున్నారు. 93 శాతం మంది రైతులకు ఐదెకరాలలోపు భూమి ఉంది. 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఒక శాతం మాత్రమే. పింఛన్ల విషయంలో వృద్ధుల ధీమా చూస్తే సంతోషం కలుగుతోంది. - సీఎం కేసీఆర్
KCR Comments: తెరాస విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజల్లో ధీమా నెలకొందని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లోనే ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. మిషన్ భగీరథ పైపులు 2 లక్షల కి.మీ. మేర ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 40 వేల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయన్నారు. కరెంట్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా మిషన్ భగీరథ జలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని వ్యాఖ్యానించారు. పాలకులు, అధికారుల అంకితభావం వల్లే ఇన్ని విజయాలు సాధించామని పేర్కొన్నారు. జీఎస్‌డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. కేంద్రం సహకరించి ఉంటే మరో రూ.3 లక్షల కోట్ల పెరిగి ఉండేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్న వాళ్ల నోరు మూయించామన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఆర్కిటెక్చర్ తెలంగాణ బిడ్డ కావడం గర్వనీయమని సీఎం పేర్కొన్నారు.
ఇవీ చదవండి: