Kabali producer KP Chaudhary arrested in drug case : ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన కృష్ట ప్రసాద్ చౌదరి బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సినిమాల పట్ల ఆసక్తితో 2016లో ఉద్యోగం వదిలేసి చిత్రసీమ వైపు వచ్చాడు. అదే సమయంలో కబాలి సినిమా తమిళ నిర్మాత పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య స్నేహంతో తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా కేపీ చౌదరి వ్యవహరించాడు. తరువాత రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నష్టపోయాడు.
Kabali Producer arrested for Drugs Supply : 2021లో కేపీ చౌదరి గోవాకు మకాం మార్చాడు. అక్కడ సముద్రతీర ప్రాంతంలో ఓఎమ్హెచ్ క్లబ్ ను ప్రారంభించాడు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనకున్న పరిచయాలతో నటీనటులకు ఖరీదైన పార్టీలు ఇచ్చేవాడు. సినీ గ్లామర్‌తో క్లబ్ సజావుగానే సాగినా ఊహించని షాక్ ఎదురైంది. ఓఎమ్హెచ్ హోటల్ నిర్మాణం అక్రమ కట్టడమంటూ గోవా మున్సిపల్ సిబ్బంది దాన్ని కూల్చివేశారు. దాంతో చౌదరి భారీగా నష్టపోయాడు. భర్తీ చేసుకునేందుకు గోవాలో మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాలతో చేతులు కలిపినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియన్ల ద్వారా ఖరీదైన కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ బ్లాట్స్ కొనుగోలు చేసి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు సరఫరా చేస్తూ ఆర్ధికంగా కుదురుకునే పనిలో పడ్డట్టు వెల్లడించారు.
"కేపీ చౌదరి ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 90 గ్రాముల కొకైన్ దొరికింది. పూర్తిగా విచారించిన తర్వాత ఎవరెవరితో ఇతనికి లింక్స్ ఉన్నాయి. ఎవరెవరికి విక్రయించాడు, అమ్మడానికి తెచ్చాడా? సొంతంగా వినియోగించుకోవడానికా? అనే విషయాలు తెలుస్తాయి. పూర్తిగా విచారణ చేసి ఎవరెవరు కస్టమర్లుగా ఉన్నారనేది సీక్రెట్‌గా తెలుసుకుంటాం. నిజ నిర్దారణ అయిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం." - జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ
ఈ ఏడాది ఏప్రిల్‌లో కేపీచౌదరి.. గోవా నుంచి హైదరాబాద్ శివారు కిస్మత్‌పూర్‌కు మకాం మార్చాడు. అభ్యుదయనగర్ కాలనీలో ఓ విల్లా అద్దెకు తీసుకున్నాడు. గోవాకు చెందిన నైజీరియన్ డ్రగ్స్ కింగ్‌పిన్ గాబ్రియేల్ ద్వారా కొకైన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చినట్లు రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు. కానీ అప్పటికే కేపీ చౌదరి కదలికలపై నిఘా ఉంచిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు కిస్మత్‌పూర్ క్రాస్‌రోడ్ వద్ద అతడు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేశారు. 100 ప్యాకెట్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్యాకెట్లు తాను వినియోగించేందుకు... మిగిలినవి స్నేహితులకు విక్రయించేందుకు తీసుకొచ్చినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడన్నారు.
గత నెల 5న మాదాపూర్ ఎస్‌వోటీ, రాయదుర్గం పోలీసులు నానక్‌రామ్‌గూడ సమీపంలో 300 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి 33 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కేసులో రాకేష్‌రోషన్, జి.శ్రీనివాసరెడ్డి, సూర్యప్రకాశ్, నైజీరియన్ విక్టర్ చుక్వాలను అరెస్ట్ చేశారు. నైజీరియన్ గాబ్రియేల్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుల మొబైల్‌ఫోన్లలోని ఆధారాలతో... సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు డ్రగ్‌రాకెట్‌లో సంబంధాలున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
రాకేష్‌రోషన్ వాట్సాప్ ద్వారా కేపీచౌదరితో లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న నైజీరియన్ గాబ్రియేల్‌ను త్వరలో పట్టుకుంటామని రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. సినిమాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కేపీ చౌదరిని విచారిస్తే.. మరింత మంది ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడ్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: