ముంబయి నుంచి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుండటం జగిత్యాల జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ధర్మపురి , కథలాపూర్ మండలాలకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం ఇద్దరికి పాజిటివ్ రావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. ముగ్గురికి నెగెటివ్ రావడంతో ఇళ్లు చేరారు. ఆరుగురు చికిత్స పొందుతుండగా శనివారం మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
ధర్మపురి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబయిలో ఉండే వ్యక్తి ఈ నెల 8న ప్రత్యేక వాహనంలో తన కుమారుడితో పాటు డ్రైవర్, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి గ్రామానికి వచ్చారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తికి మధుమేహం ఉండటంతో పరీక్షల కోసం బుధ, గురువారం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా నిర్ధారణ అయింది.
కథలాపూర్ మండలంలో..
మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఓ గ్రామానికి చెందిన కార్మికుడు ముంబయి నుంచి ఈనెల 10న తన స్వగ్రామం వచ్చాడు. అప్పటి నుంచి సదరు వ్యక్తిని అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శనివారం గాంధీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. ముంబయితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు విధిగా గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఎవరైనా బయటకు వస్తే వారి వివరాలను సంబంధిత అధికారులకు తెలపాలని వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దుకాణాల యజమానులు వారికి కేటాయించిన సంఖ్యకు అనుగుణంగానే దుకాణాలు తెరవాలని, నిర్ణీత వేళలు పాటించాలని సూచించారు.
- కలెక్టర్ రవి
ఇళ్ల నుంచి బయటికి వస్తే కఠిన చర్యలు
మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు 14 రోజులపాటు స్వీయ గృహనిర్బంధంలోనే ఉండాలని ఆర్డీవో నరేందర్ అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరాన్ని పాటించాలని సూచించారు. ఇటీవల మహారాష్ట్ర నుంచి మల్యాల మండలం గొల్లపల్లెకు చేరుకొన్న వలస కార్మికులను శనివారం కలిసి మాట్లాడారు. ఇంటి నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.