ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన నూతన పథకాలను జిల్లాలో అమలుకు సంబంధించి బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రైతులకు సహకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1 లక్ష కోట్లను ప్రత్యేకంగా ప్రకటించిందన్నారు.
2020 నుంచి 2030 వరకు 10 ఏళ్లలో నిధులను వినియోగిస్తూ.. వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం తీసుకునే రుణాలు 2 కోట్ల రుపాయలకు 7 ఏళ్లకు వడ్డి కేవలం 3 శాతం ఉంటుందన్నారు. అంతేగాక రూ.2 కోట్ల వరకు బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారంటి ఉంటుందని తెలిపారు.
రైతు సంఘాలు గోదాములు, వేర్ హౌజ్‌లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు, విత్తన శుద్ధి కేంద్రాలు, తదితరాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. రైతులు, వ్యవసాయాధారిత ఔత్సాహికవేత్తలు, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాలు, ఎఫ్.పి.ఒ, పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ సంస్థలకు రుణాలు అందించడం జరుగుతుందని
ఆయన పేర్కొన్నారు.
నాబార్డు సహకారంతో బ్యాంకులు రుణాలు అందిస్తామని, దానికి సంబంధించి నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకుంటామని అన్నారు. ఈ పథకాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖ, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఉద్యాన, కేవీకే, ఆత్మ, స్థానిక సంస్థల నుంచి నిపుణులతో ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. వచ్చే 5 ఏళ్లలో 10 వేల ఎఫ్.పి.ఓలు తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్థేశించుకుని పనిచేస్తుందన్నారు.
జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు లక్ష్మీపూర్, సూరంపేట్ రెండు గ్రామాల్లో ఎఫ్.పి.సి.ఎల్ ప్రోత్సహించిందని, ఈ నేపథ్యంలో జిల్లాలో ఇతర మండలాలను గుర్తించాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నూతన పథకాలపై రైతులకు ఎక్కువ అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : హైదరాబాద్‌లో మూడుసార్లు కంపించిన భూమి