జగిత్యాల కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ సినీనటికి పంపిన సందేశంపై చిక్కుముడి వీడింది. ఈ నెల 19న కలెక్టర్ అధికారిక ఖాతా నుంచి ట్విట్టర్‌లో సినీనటి రష్మిక పోస్టు చేసిన ఫొటోలపై 'చించావు పో రష్మిక’' అనే సందేశం వెళ్లింది. ఇది వైరల్ కావడం వల్ల జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ గుగులోతు రవి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అప్పటికప్పుడు విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులను తొలగించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో జిల్లా రెవెన్యూ అధికారి అరుణశ్రీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఐటీ విభాగం సిబ్బంది విచారణ జరపగా.. 2018 డిసెంబరులో సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఇ-మేనేజ్‌మెంట్‌కు నోడల్ అధికారిగా వ్యవహరించిన జగిత్యాల పరిశ్రమల శాఖ ఉద్యోగి గంగాధర శ్రీనివాస్ సందేశాన్ని పంపినట్లు తేలింది. అతన్ని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించగా తన చరవాణి ద్వారా కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతాను వినియోగించినట్లు తేలింది.
తదుపరి విచారణ కోసం చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సింధుశర్మ చెప్పారు. అనధికారికంగా ఇతరుల సామాజిక మాధ్యమాల ఖాతాలు వినియోగించినా, వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. కలెక్టర్ ట్విట్టర్ ఖాతా వ్యవహారంపై నిందితుని గుర్తించిన పట్టణ సీఐ కె. జయేష్ రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఐటీ కోర్ ఎస్సై శంకర్‌నాయక్, సిబ్బంది కిరణ్, మల్లేశంలను ఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!