Controversy between Sanjay Kumar and Bhoga Sravani: జగిత్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య నలగుతున్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఈరోజు బయటపడింది. చివరకు మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా చేసి తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులతోనే తాను రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఎమ్మెల్యే సంజయ్ మూర్ఖత్వాన్ని మూడేళ్లపాటు భరించానని వాపోయిన ఆమె.. అందరి ముందు ఎమ్మెల్యే అవమానించేవారని ఆరోపించారు. పేరుకే మున్సిపల్ ఛైర్మన్.. పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని ఆమె విచారం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదని.. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని.. కేటీఆర్ పేరు ఎత్తకూడదనే ఆంక్షలు జారీ చేసేవారని వాపోయారు. కలెక్టర్‌ను కలవవద్దని కూడా హుకూం జారీ చేసేవారని తెలిపారు. ఒక బీసీ బిడ్డగా తన ఎదుగదల చూడలేక సంజయ్‌కుమార్ తనపై కక్షగట్టారని ఆమె భావోద్వేగానికి గురైయ్యారు.
సంజయ్ కుమార్‌తో నా కుటుంబానికి ఆపద పొంచి ఉంది: అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని తెలిపారు. తనతో పాటుగా మున్సిపల్ కమిషనర్‌ను కూడా సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె ఆరోపించారు. దీంతో కమిషనర్ సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో తనకి తన కుటుంబానికి ఆపద ఉందని జిల్లా ఎస్పీ తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా.. గత నాలుగు రోజుల క్రితం 27 మంది మున్సిపల్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై తిరుగుబావుటా ఎగుర వేసిన విషయం తెలిసిందే.
"మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బుల కోసం డిమాండ్ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పాం. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారు. ఆయన చేసే పనులకు అడ్డుచెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకూం జారీ చేశారు. నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది. అందుకే రాజీనామా చేస్తున్నాను. కవితను కలవకూడదు. కేటీర్ పేరు ప్రస్థావించకూడదని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో మా కుటుంబానికి ఆపద ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ అందరికి ధన్యవాదాలు.. నా పదవికి రాజీనామా చేస్తున్నా..".- భోగ శ్రావణి, మున్సిపల్ ఛైర్పర్సన్
ఇవీ చదవండి: