జగిత్యాల జిల్లాలో ఎరువుల దుకాణ డీలర్లతో కలెక్టర్ గుగులోతు రవి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌లో అత్యధికంగా సాగయ్యే అవకాశం ఉన్నందున రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీలర్లకు సూచించారు. జగిత్యాలలోని పుల్లురి నారాయణ దాసు ఫంక్షన్ హాల్లో ఎరువుల డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2 లక్షల 38 వేల 269 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. 35 వేల 460 మెట్రిక్ టన్నుల యూరియా, 20 వేల753 మెట్రిక్ టన్నుల డీఏపీ, 11 వేల 365 మెట్రిక్ టన్నుల ఏంఓపీ, 21,183 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎరువులు సిద్ధం చేసుకోవాలన్నారు. స్థలం లేకపోతే సమీపంలోని కల్యాణ మండపాల్లో నిల్వ చేసుకోవచ్చని డీలర్లకు సూచించారు.
ముందుగానే ఎరువులు తీసుకోవాలి...
ప్రభుత్వ భవనాలు ఉన్నా వాడుకోవాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీ విషయంలో ఒక కమిటీని కూడా నియమిస్తున్నట్లు కలెక్టర్ రవి వివరించారు. ఎరువుల కంపెనీల నుంచి ఎరువులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రైతులు ముందుగానే ఎరువులు తీసుకోవాలని కోరారు. ఎరువుల కోసం వచ్చే రైతులు మాస్కులు ధరించేలా చూడాలని డీలర్లకు సూచనలు చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, డీసీఓ రామానుజా చార్యులు, మార్క్ఫెడ్ అధికారి దివ్యభారతితో పాటు ఎరువుల కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- 6 గంటలు రోడ్డుపైనే కరోనా రోగులు