తెల్లారకుండానే క్యూ కడుతున్న ఆధార్ కార్డులు, వాటర్ బాటిళ్లు.. - తెలంగాణ వార్తలు
తెల్లారకుండానే ఆధార్ కార్డులు, చెప్పులు, వాటర్ బాటిళ్లు క్యూ కట్టాయి. గంటల తరబడి ఎండలోనే ఉన్నాయి. సమయం వచ్చే వరకు వాటిని తీసుకొచ్చినవారి తరఫున ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయి. ఇదందా ఏ రేషన్ దుకాణం వద్దనో.. ఓటింగ్ కేంద్రాల వద్దనో కాదు.. కొవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద పరిస్థితి.
![తెల్లారకుండానే క్యూ కడుతున్న ఆధార్ కార్డులు, వాటర్ బాటిళ్లు.. covid centers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11485504-thumbnail-3x2-covid-rk.jpg?imwidth=3840)
తెల్లారకుండానే కొవిడ్ పరీక్ష కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. కిట్ల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల వేకువ జామునే వచ్చి.. ఎండలోనే నిరీక్షిస్తూ పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షకోసం సుమారు 6 గంటలు పట్టడం వల్ల అప్పటి వరకు పొడెండలో నిలవలేక ఆధార్ కార్డులు, చెప్పులు, వాటర్ బాటిల్ ఇలా ఏదొకటి తమ తరఫున క్యూలో పెడుతున్నారు.
![jagtial news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-12-21andharikipareekshe-av-ts10037_21042021153343_2104f_1618999423_434.jpg)
కిట్ల సంఖ్య పరిమితంగా... అనుమానితుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రంలో కొవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ భారీగా ఉంటోంది. కొన్ని చోట్ల 50 మందికే పరీక్షలు చేస్తుంటే.. కొన్ని చోట్ల వంద నుంచి 150 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరుగుతున్నందున తెల్లారకుండానే అనుమానితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఉదయం వచ్చిన వారికి టోకెన్లు పంపిణీ చేసి మధ్యాహ్నం పరీక్షలు చేస్తున్నారు. ఉదయం వచ్చి తిరిగి ఇంటికెళ్లలేక పరీక్ష చేసే వరకు ఎండలోనే వేచి చూస్తున్నారు. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలు ఊరికి దూరంగా ఉండడం వల్ల దుకాణాలు అందుబాటులో ఉండడం లేదు. కనీసం తాగునీరు లేక అలమటిస్తున్నారు.
![jagtial news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-12-21andharikipareekshe-av-ts10037_21042021153343_2104f_1618999423_1091.jpg)
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షల కోసం పలువురు ఆధార్ కార్డులను వరుసలో ఉంచారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి కరోనా పరీక్షల కోసం ఎక్కువ సంఖ్యలో వస్తుండగా పీహెచ్‌సీలో కిట్ల లభ్యతను బట్టి 100 నుంచి 150 వరకు పరీక్షలు చేస్తున్నారు. తమ వంతు వచ్చేసరికి పరీక్షలు ముగుస్తుండటంతో కొందరు వెనుదిరగాల్సి వస్తోంది. దీంతో పరీక్షల కోసం ఉదయం 7 గంటలకే పీహెచ్‌సీకి చేరుకొని ఆధార్ కార్డులను ఇలా వరుసలో పెట్టారు. కిట్లను తగినంత అందుబాటులో ఉంచి పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: నగరంలో కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ