అల్పపీడన ప్రభావంతో జగిత్యాల జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు (Telangana Rains)పడుతున్నాయి. మెట్‌పల్లి, కోరుట్ల భారీ వర్షంతో అతలాకుతమైంది. మెట్‌పల్లి, కోరుట్లలో జాతీయ రహదారిపై ఏళ్లుగా మురుగుకాల్వల నిర్మాణం సాగుతుండటంతో వర్షపు నీరంతా ఎటూ వెళ్లలేక ప్రధాన రహదారిపై నిలిచిపోయింది. కోరుట్లలో లోతట్టు ప్రాంతాలైన ఆదర్శ్ నగర్ ఇందిరానగర్, ప్రకాశం రోడ్డు, ముత్యాలవాడలోకి భారీ ఎత్తున వరద నీరు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా హుస్నాబాద్ ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి.
కొట్టుకుపోయిన ఎడ్లబండి...
వరద ఉద్ధృతితో ఎడ్లబండి కొట్టుకుపోయి రెండు ఎడ్లు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో చోటుచేసుకుంది. అబ్ధుల్ అన్వర్ అనే వ్యక్తి వ్యవసాయ పనుల కోసం ఎడ్లబండితో వాగు దాటుతుండగా ఎగువన కురిసిన భారీ వర్షాలతో వాగులో ఉద్ధృతి పెరిగింది. నీటి ప్రవాహం పెరగడం వల్ల ప్రమాదవశాత్తు వాగులో ఎడ్లబండి కొట్టుకుపోయింది. దాదాపు కిలోమీటరు వరకు ఈదుకుంటూ వెళ్లి అన్వర్ ప్రాణాలు కాపాడుకున్నాడు.
వికారాబాద్ జిల్లాలోనూ...
వికారాబాద్ సహా పూడూరు, ధరూర్, నవాబ్‌పేట్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అమరవరం,శ్రీనివాసపురం మధ్యలో రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి: Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం