Hanuman Chinna Jayanathi Utsavalu: రాష్ట్ర వ్యాప్తంగా ఆంజనేయ జయంతి ఉత్సవాలు హోరెత్తిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు భక్త జన సంద్రమైంది. దీక్షా పరులు దీక్షా విరమణ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి మొదలైన రద్దీ ఉదయానికి కాస్త తగ్గింది. జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు లేకపోవటంతో... భక్తులు భారీగా తరలి వచ్చి అంజన్నను దర్శించుకుంటున్నారు.
కొండగట్టులో ఫ్లెక్సీల వివాదం
కొండగట్టులో వివాదం చోటు చేసుకొంది. ఫ్లెక్సీలో తమ గ్రామం పేరు, ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకుండా ఏర్పాటు చేశారని ముత్యంపేట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆలయ ఈవో వెంకటేష్‌తో వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ తుంగలో తొక్కారని ఫ్లెక్సీలను చింపివేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తాము 15 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చామని తెలిపారు. అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న మండలాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఆలయాన్ని అభివృద్ధి పరచకుండా నిధులను అన్యాక్రాంతం చేస్తున్నారని ముత్యంపేట గ్రామస్తులు ఆరోపించారు.
ఇదీ చదవండి: కోలాహలంగా అంజనీపుత్రుని శోభాయాత్ర.. మారుమోగుతోన్న జైహనుమాన్ నినాదాలు..