జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్కు ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఆదివారం వచ్చిందంటే చాలు మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటారు. మద్యం, మాంసం ముట్టకుండా కేవలం కూరగాయాలతో ప్రతి ఇంట్లో భోజనం చేసుకుంటారు. ఈ గ్రామంలో మల్లన్నస్వామిని కొలిచే గ్రామ ప్రజలు ఆదివారం రోజున స్వామి వారికి నిష్టగా పూజలు చేస్తారు. స్వామి వారిని మొక్కుకున్న వారికి మొక్కుకున్నంతా కొంగుబంగారంగా మారుతున్నాడు. గ్రామంలో ఏ ఇంట్లో వారిని చూసినా ఆదివారం వచ్చిందంటే తల స్నానాలు చేసి పిల్లపాపలతో కలిసి మల్లన్నస్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆదివారం వారికి ప్రత్యేకం...
ఇక గ్రామంలో ఆదివారం రోజు ఏ శుభకార్యాలను నిర్వహించరు... ఎందుకంటే ఆదివారం మాంసంతో భోజనాలు పెట్టరు... మరోరోజు చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే కూరగాయలతో భోజనాలు వడ్డిస్తారు. ఇలా ఆదివారం మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
15ఏళ్లుగా ఇదే తంతూ
ప్రతి ఏటా హోళి పౌర్ణమి పండుగ తర్వాత వచ్చే ఆదివారం రోజున మల్లన్నస్వామికి బోనాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవానికి మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఇలా ఈ గ్రామంలో మల్లన్న స్వామి కోసం ఆదివారంను గ్రామస్థులు కేటాయించుకున్నారు. గత 15 ఏళ్లకు పైగానే ప్రజలు ఆదివారం మద్యం, మాంసంను పక్కన పెట్టి కూరగాయల ప్రియులుగా మారారు.