Dharmapuri Constituency election controversy: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు ఎట్టకేలకు తెరిచారు. జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజీలో ఉంచిన స్ట్రాంగ్ రూంను కలెక్టర్ యాస్మిన్‌భాషా.. అధికారులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో తాళాలు పగులగొట్టి గదిని తెరిచారు. అందులోని పత్రాలు, సీసీ ఫుటేజీని పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఈ నెల 26న హైకోర్టుకు అధికారులు సమర్పించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
కోర్టులు, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. కలెక్టర్ సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లు తెరిచారని.. అందులోని 4 ట్రంకుపెట్టెల తాళంచెవులు కూడా లేకపోవడంతో వాటి తాళాలు పగలగొట్టారన్నారు. అధికారులు రికార్డులను హైకోర్టుకు అందజేస్తారని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం 2018 శాసనసభ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఓట్ల లెక్కింపులో.. 441 ఓట్ల మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ గెలిచారు.
ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, అవకతవకలు జరిగాయని, సరిగ్గా ఓట్లు లెక్కించకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు.. అప్పటి ఈవీ ప్యాడ్‌లు ఉన్న స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు ఆదేశించింది. ఈ నెల 10న హైకోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులతో కలిసి వెళ్లారు.
పటిష్ఠ భద్రత.. మూడు గదులలో ఈవీ ప్యాడ్‌లు భద్రపరచగా.. ఒక గది తాళం చెవి మాత్రమే అధికారుల వద్ద లభ్యమైంది. మిగతా గదుల తాళం చెవులు లేవని కలెక్టర్ తెలిపారు. దీంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే మరోసారి కోర్టు జోక్యం చేసుకోని తాళాలు పగులగొట్టి ఎన్నికల పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించడంతో.. రంగంలోకి దిగిన అధికారులు జగిత్యాల వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టి రికార్డులను పరిశీలించారు.
సీఈసీ జోక్యం: తాళం చెవుల మాయంపై విచారణ జరపాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ విచారణకు సంగారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్ కలెక్టర్లు డాక్టర్ శరత్, షేక్ యాస్మిన్ బాషా, గుగులోతు రవిలు హాజరయ్యారు. వీరితో పాటు కుమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం.. మరో 40 మంది సిబ్బందిని అధికారులు విచారించారు.
ఇవీ చదవండి: