రాజకీయాలకతీతంగా దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలోని సుప్రసిద్ధ సాంబశివ దేవాలయం ఆవరణలో నిర్వహించిన ఎడ్లబండి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశు సంపదను కాపాడుకోవాలన్న సందేశంతో పాటు, ఎడ్లబండ్ల పోటీల ద్వారా ఐక్యత పెంపొందుతుందని జీవన్ రెడ్డి తెలిపారు.
విజేతలకు స్థానిక నాయకుడు బాలాగౌడ్ ఆధ్వర్యంలో పావు తులం బంగారం, వెండిని ప్రదానం చేశారు. పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు. పోటీలను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు.