ఇటీవలే ప్రమాదవశాత్తు కోడి కత్తి.. ఓ వ్యక్తి మర్మాంగాలకు తగిలి మరణించిన ఘటనలో కోడిని అరెస్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్సై జీవన్ వెల్లడించారు. హత్యకు కారణమైన కోడిని ఎవరూ ఏమీ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఠాణాకు తీసుకెళ్లి సంరక్షించినట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే...
ఇటీవలే లొత్తునూర్ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీశ్ (45) ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా... కోడి కాలికి కత్తి కట్టేటప్పుడు అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కత్తి... సతీశ్ పురుషాంగానికి, వృషణాలకు తగలగా అక్కడే కుప్పకూలాడు. అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలోనే సతీశ్ మృతి చెందాడు.
అరెస్ట్ చేయలేదు...
ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. సతీశ్ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. దర్యాప్తులో భాగంగా ఆ కోడిని సంరక్షించే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. అందులో భాగంగానే సదరు కోడిని కోళ్ల పారంలో అప్పగించారు. అంతేకాని కోడిని అరెస్ట్ చేయడం కానీ, అదుపులోకి తీసుకోవడం కాని జరగలేదని పోలీసులు తెలిపారు.