Bandi Sanjay Respond On Gujarat Election Results: గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై రాష్ట్రంలోని కాషాయ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడోసారి కమలం విజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గుజరాత్లో ఎన్నికల ఫలితాల మాదిరిగానే.. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు . ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా మొగిలిపేట గ్రామంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ బండి సంజయ్ ముందుకు కదిలారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ వెంట నడిచారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ జెండా ఎగరవేస్తుందని స్పష్టం చేశారు. గడీల పాలన బద్దలు కొడతామని.. కేసీఆర్ను గద్దె దించి డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావడమే తమ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు.
గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసినా, గుజరాత్ ప్రజలు బీజేపీ, ప్రధాని నాయకత్వంపై నమ్మకం ఉంచారని తెలిపారు. వరుసగా ఏడోసారి కమలానికి పట్టం కట్టిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు కచ్చితంగా తెలంగాణపై ప్రభావం చూపుతాయని డీకే అరుణ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: