Alternative crop research in Polasa: వరికి బదులుగా ఇతర పంటలు పండించడం ద్వారా అధిక లాభాలు ఆర్జించేలా జగిత్యాల జిల్లా పొలాసలో పరిశోధనలు జరుగుతున్నాయి. పొలాసలో పాల్‌టెక్నిక్, వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. ఇందులో పాల్‌టెక్నిక్‌తోపాటు, బీఎస్సీ, పీజీ విద్యార్థులు చదువుతున్నారు. చివరి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఆరుతడి పంటలపై పరిశోధనలు చేస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి సాధించి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించవచ్చనే అంశంపై పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆవాలు, పెసర, స్వీట్ కార్న్ పంటలను సాగు చేశారు. వీటి నుంచి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. ఈ పరిశోధనలు రైతులకు ఉపయోగపడుతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెగుళ్లను తట్టుకునేలా
మా పరిశోధనల్లో భాగంగా తెగులుకు తట్టుకుని అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న సంకర రకాలను సాగు చేస్తున్నాం. హైబ్రిడ్ వరి ఉత్పత్తిలో పెట్టుబడి ఎక్కువ.. నాణ్యత తక్కువ. పుష్ప లక్షణాలను బట్టి అన్ని తెగుళ్లను తట్టుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చలి కారణంగానూ యాసంగిలో వరి దిగుబడి తక్కువగా వస్తుంది. రసాయన ఎరువులు వాడటం వల్ల నేలలో మార్పులు వస్తాయి. ఏ మోతాదులో ఎరువులు వాడితే నేల ఆరోగ్యంగా ఉండి రైతులకు దిగుబడులు ఉంటాయో వాటిపై కూడా పరిశోధన చేస్తున్నాం. --- పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు
ఆవాలతో అధిక దిగుబడి
ఆరుతడి పంటల్లో భాగంగా ఆవాల పంటపై పరిశోధన చేస్తున్నాం. తెలంగాణ నేలలో సూక్ష్మధాతు లోపం ఉంటుంది. అధిక దిగుబడి వచ్చేందుకు నీరు చాలా ముఖ్యం. ఏ మేరకు నీటిని ఎలా వాడాలో దానిపై వివరంగా తెలుసుకుని రైతులకు తెలియజేస్తాం. నానో యూరియాను ఆవాల పంటలో యూరియాతో కలిపి వేసినప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కూడా మా పరిశోధనల్లో భాగం. --- పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు
ప్రస్తుతం సాగు చేసిన పంటలకు తోడు నువ్వులు పంటను సైతం సాగు చేయనున్నారు. వీటితో పాటు వరిలోనూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఎలా సాధించాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. తాము చేసిన పరిశోధనలను రైతులకు త్వరలోనే తెలియజేస్తామని విద్యార్థులు తెలిపారు.
ఇదీ చదవండి: నెల రోజులైనా మొలకెత్తని పొద్దుతిరుగుడు.. నిండా మునిగిన అన్నదాతలు