ఊరు చిన్నదయినా సరే హనుమాన్ విగ్రహమో, గుడో ఉంటే భూతపిశాచాల బెడద ఉండదనే ధైర్యం స్వామి భక్తులది. కానీ హనుమంతుడు ఊరికి నలుదిక్కులా కొలువై, తమను కాపాడుతున్నాడని అంటున్నారు జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం వెల్లుల్ల వాసులు. ఎందుకంటే అక్కడ ప్రతి వీధిలోనే కాదు, పంటపొలాల్లోనూ హనుమాన్ విగ్రహాలు, ఆలయాలు చూడొచ్చు. దాంతో ఏ పండుగ వచ్చినా ఊరంతా స్వామికి పూజలు చేసి ఆనందిస్తారు. వెల్లుల్లతోపాటూ రాంచంద్రంపేట, మాసాయిపేట కలిపి సుమారు నలభై వరకూ ఆలయాలు, విగ్రహాలు ఉంటాయని చెబుతున్నారు స్థానికులు.
స్థలపురాణం
చరిత్ర ప్రకారం... 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని జైనులు పాలించేవారు. ఆ సమయంలో గ్రామంలోని ఓ భాగంలో సుమారు 200 వరకూ బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవట. దాంతో ఆ భాగాన్ని బ్రాహ్మణపురి అని పిలిచేవారట. ఆ కుటుంబాలన్నింటినీ జైనులే పోషించేవారట. ఆ సమయంలో జైనులు గండి హనుమాన్, ప్రహ్లాద సహిత లక్ష్మీనరసింహస్వామి, గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయాలు కట్టించారని చరిత్ర చెబుతోంది. జైనులు నిర్మించిన ఆలయాలతో పాటు బ్రాహ్మణ కుటుంబాలు దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకునేవారట. కాలక్రమేణా బ్రాహ్మణ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసపోవడంతో ప్రస్తుతం అక్కడ రెండే కుటుంబాలు మిగిలాయి. అలా వాళ్లు ఏర్పాటుచేసిన హనుమాన్ విగ్రహాలకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.
ఊరి పడమటి దిక్కుకు అభిముఖంగా నైరుతిలో ఉన్న గండి హనుమాన్ ఆలయం మొదటిదని గ్రామస్థులు పేర్కొన్నారు. అప్పట్లో రైతులే కాదు, ఊరంతా స్వామిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారు. కాలక్రమంలో ఏదయినా కార్యం తలపెట్టేటప్పుడు ఆంజనేయుడికి మొక్కుకునే సంప్రదాయం మొదలైందట. ఆ పని పూర్తయిన వెంటనే హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి మొక్కు తీర్చుకునేవారట. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ విగ్రహాల్లో కొన్నింటికి ఆలయాలు ఉంటే మరికొన్నింటికి లేవు. అలా మొత్తంగా కలిపి పంటపొలాల్లో, చెరువు ఒడ్డున... రోడ్డుకు ఇరువైపులా హనుమాన్ విగ్రహాలు కనిపిస్తాయి. ఇలా ఊరంతా కొలువైన స్వామికి ప్రతి మంగళ, శనివారాల్లోనే కాదు, హనుమాన్ జయంతి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు భక్తులు. హనుమాన్ జయంతి రోజున అయితే చిన్నా, పెద్దా తేడా లేకుండా పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్షను చేపట్టి పూజలు చేస్తారు. ఆ సమయంలో దీక్ష తీసుకున్న స్వాములు చేసే పూజలు, భజనలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.
ఇతర ఆలయాలూ...
వెల్లుల్లలో హనుమాన్ ఆలయాలే కాకుండా గుట్టపైన ప్రహ్లాద సహిత లక్ష్మినరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని జైనులే నిర్మించారని అంటారు. ఈ ఆలయంలో ఏటా లోక కల్యాణార్థం యాగ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా పురాణ ఓంకారేశ్వర ఆలయంతోపాటు గణపతి సన్నిధానం, గ్రామ శివారులో ఎల్లమ్మ గుడిని కూడా చూడొచ్చు. ఏ పర్వదినం ఉన్నా... చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు ఇక్కడకు వచ్చి ఆలయాలను దర్శించుకుంటారని భక్తులు చెబుతున్నారు.
ఎలా చేరుకోవచ్చు
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి వెల్లుల్ల గ్రామం 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెట్‌పల్లి పట్టణం నుంచి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయానికి రావాలనుకునే భక్తులకు జగిత్యాల నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: RAIN: జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..!