ఊహ తెలియనప్పుడే తండ్రిని కోల్పోయింది. మాటలు తిరుగుతున్న దశలో తల్లి మరణం చూసింది. ఉన్న తోడు అన్న ఒక్కడే. లేని అమ్మానాన్నను అన్నలో చూసుకుంటూ అమ్మమ్మ ఇంట్లోనే పెరుగుతోంది. పగబట్టిన విధి ఆమెను వెంటాడుతూనే ఉంది. ఉన్న ఒక్క ఆశ... అన్నను తీసుకుపోయి తనను ఒంటరిదాన్ని చేసింది. చిన్ననాటి నుంచి తనను ఆడించి పెంచిన అన్నకు తానే తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారకర ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన నరెడ్ల మల్లేశ్, రాధ దంపతులకు వెంకటేష్, శరణ్య పిల్లలు. 15ఏళ్ల క్రితం మల్లేశ్ అనారోగ్యంతో మృతిచెందాడు. అతని భార్య రాధ 12ఏళ్ల క్రితం అనారోగ్యంతోనే ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు వెల్గటూరు మండలం స్తంభంప్లల్లిలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. 20 ఏళ్లున్న వెంకటేష్ ఏడాదిగా ఊపిరితిత్తులు, మధుమేహం వ్యాధితో బాధపడుతు మృతిచెందాడు.
తల్లిదండ్రులు, ఉన్న ఒక్కదిక్కు అయిన అన్నను కోల్పోయిన శరణ్య ఒంటరిగా మిగిలింది. సోదరుడి మృతదేహానికి తానే అంత్యక్రియలు నిర్వహించింది. ఆ బిడ్డకొచ్చిన కష్టం చూపరుల హృదయాన్ని కలచివేసింది. శరణ్య ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. ఆమె చదువుకు మనసున్న మారాజులు సాయం అందించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా..? ఆరోగ్యశాఖ తర్జన భర్జన..!