పట్టభద్రుల ఓటర్ల ముసాయిదాలో అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వ్యవహరించిన తీరు దారుణమని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు రాణి రుద్రమ అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రుల ఓటర్ల ముసాయిదాలో ఉన్న అవకతవకల విషయంలో బుద్ధ భవన్‌లోని కార్యాలయంలో ఆయనని కలిస్తే దురుసుగా ప్రవర్తించారని విమర్శించారు. ఓటర్లకు సంబంధించి చిరునామా లేకుండా ముసాయిదా ఎలా తయారు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
ఓటరు జాబితాలో చిరునామా లేకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బోగస్ ఓటర్లను గుర్తించడం కష్టమవుతుందని అన్నారు. శశాంక్ గోయల్ వైఖరికి నిరసనగా ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరునామాతో కూడిన ఓటరు జాబితా ముసాయిదాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పోలీసులు వచ్చి వారిని విరమింపజేశారు.
ఇదీ చదవండి: ఫామ్‌హౌజ్ వివాదంలో కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ