గోమహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టులో యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ వ్యాజ్యం దాఖలు చేశారు. గోమహా పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసులు చూపిన కారణాలు సహేతుకమైనవి కావని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈనెల 5న ప్రారంభం కావాల్సిన గోమహా పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోడవంపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు షరతులతో పాదయాత్రకు అనుమతివ్వాలని రాచకొండ పోలీసులను ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, 20 మందికి మించకుండా పాదయాత్ర చేసుకోవాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇది గో విజయమని...గో బంధువుల విజయమని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్దంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... 25 మందితో పాదయాత్ర చేపడతామని అనుమతి కోరితే నిరాకరిస్తూ పోలీసులు చూపిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పాదయాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడం కాదు.. గోవుల ప్రాణాలు తీస్తున్న వారిని అడ్డుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానం చెప్పిన విధంగా శాంతియుతంగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 20 మందితో కరోనా నిబంధనలు పాటిస్తూ... యాత్ర చేస్తామని తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు మింట్ కాంపౌండ్‌లోని త్రిశక్తి హనుమాన్ టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు.
ఇదీ చదవండి: అగ్రిగోల్డ్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి