తెలంగాణ కోసం ముందుకొచ్చిన షర్మిల తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు రాజన్న పాలన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. అందరూ ఆమెను దీవించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి కోరారు. వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా హెచ్ఐసీసీలో సంస్మరణ సభ నిర్వహించారు. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు నేతలు, వైద్యులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులు సభకు హాజరయ్యారు. తమ కుటుంబం ధన్యమైందన్న వైఎస్ విజయలక్ష్మి.. జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా అక్కడ రాజన్న పాలన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలోనూ రాజన్న రాజ్యం కోసం ఆయన బిడ్డ షర్మిలకు దీవెనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్‌కు ప్రజలకు మధ్య ఉన్న ప్రేమాభిమానాలు అనిర్వచనీయమన్న విజయమ్మ.. ఆయన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ ప్రజలు తన కుటుంబం, బాధ్యత అనిపించిందని... ఆ మేరకు తన గుండెలపై తండ్రి విల్లు రాశారని షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజల కోసం నిలబడి, కొట్లాడి, సేవ చేస్తానన్న ఆమె... వైఎస్ పథకాలను సజీవంగా ఉంచడమే తన లక్ష్యమని అన్నారు. తెలంగాణలో మళ్లీ రాజశేఖరరెడ్డి పాలన తీసుకురావడమే ఆయనకిచ్చే నివాళి అని తెలిపారు. నియంత రాజ్యం పోయి ప్రజల పాలన రావాలన్న షర్మిల... ప్రజలు కష్టాల్లో ఉంటే, రాష్ట్రం అప్పుల పాలు అవుతోంటే చూసి ఉండలేకపోయానని వ్యాఖ్యానించారు. కరోనా లాంటి మహమ్మారి సమయంలోనూ ప్రజల కష్టాలు వినని ప్రభుత్వం పోవాలని అన్నారు.
వైఎస్‌ను కోల్పోవడం ఆంధ్ర, దేశ ప్రజల, కాంగ్రెస్ దురదృష్టమన్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు... తెలంగాణలో ప్రతి ఎకరం సస్యశ్యామలం కావడానికి వైఎస్ వేసిన పునాదులే కారణమని తెలిపారు.
'రాజశేఖర్‌రెడ్డిని తలవకుండా రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికిీ ఒక్క రోజు కూడా గడవని సందర్భం మనం చూస్తా ఉన్నాం. నలుగురు ఒక చోట కూడితే ఆ ఒక్కడు ఉంటే ఇలా జరిగుండేది కాదు.. వంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. లెక్కలేనన్ని సంక్షేమ పథకాల్లో రాజశేఖర్‌రెడ్డి కనిపిస్తా ఉన్నారివాళ. రాజశేఖర్‌రెడ్డి.. మన మధ్య లేకపోయినా ఆయన మాటలు, పనులు.. గుర్తుండిపోతాయి.'
-విజయమ్మ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి
ఇదీచూడండి: YSR: దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కు రేవంత్‌రెడ్డి నివాళి