YS Sharmila met with party leaders: రాజకీయ వివాదాల నేపథ్యంలో వాయిదా పడిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 4 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు రంగం సిద్ధం చేశారు. తనపై, నాయకులపై దాడి, అరెస్టుల నేపథ్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్‌లో షర్మిల.. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.
ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస వ్యవహారశైలి, పోలీసుల నిర్భందాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బెదింపులు, ప్రజాప్రస్థాన పాదయాత్ర మళ్లీ కొనసాగింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఎల్లుండి జిల్లా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఈ కార్యకర్తల సమావేశంలో షర్మిల ప్రకటించారు. ఈ యాత్ర 10రోజులు కొనసాగి ఈ నెల 14వ తేదీన ముగిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ వాగ్దానాలు, ప్రభుత్వ అవినీతి అక్రమాలు ప్రజలకు వివరిస్తూ సాగనున్న ప్రజాప్రస్థాన పాదయాత్రలో ఎన్ని రకాల దాడులు చేసినా.. కొట్టినా.. చంపినా బెదిరేది లేదని షర్మిల అన్నారు. ఆపద సమయంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. మీరంతా నా కుటుంబం అని షర్మిల పేర్కొన్నారు.
ఇవీ చదవండి: