YS Sharmila Phone Call to Sanjay and Revanth : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని కోరారు. ఈ మేరకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామన్న షర్మిల.. ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు.
ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల అన్నారు. కలిసి పోరాడకపోతే ప్రతిపక్షాలను కేసీఆర్ బతకనివ్వరని ఆరోపించారు. షర్మిల సూచనలకు మద్దతు తెలిపిన బండి సంజయ్.. ఉమ్మడి పోరాటంపై త్వరలోనే సమావేశమవుదామని ఆమెకు తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. మరోవైపు దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని.. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఉమ్మడి పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
''నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదాం. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసి ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దాం. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి. కలిసి పోరాటం చేయకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాలను కేసీఆర్ బతకనివ్వరు.''- ఫోన్‌లో వైఎస్ షర్మిల
చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరణ..: రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ వైఎస్ షర్మిల మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. లీకేజీలో కమిషన్ సభ్యుల నుంచి మంత్రుల వరకు పెద్ద పెద్ద వ్యక్తుల హస్తం ఉందని ఆరోపించారు. కేసులో అసలు నిందితులను తప్పించి.. చిన్న చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. అసలు నిందితులను పట్టుకుని శిక్ష పడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు.
షర్మిల ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ఆమె తప్పుబట్టారు. తన ఇంటి చుట్టూ 24 గంటలూ భారీగా పోలీసులు మోహరిస్తున్నారని.. తనను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలపై ఏవైనా కార్యక్రమాలు పెట్టుకుంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు. ముట్టడి కార్యక్రమం కోసం ఇంటి నుంచి బయటకు వస్తే క్రిమినల్స్‌కు ఇచ్చినట్లుగా తనకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..
TSPSC కార్యాలయ ముట్టడికి యత్నం.. వైఎస్ షర్మిల అరెస్ట్
పోలీసులు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్ షర్మిల