Sharmila comments: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజేశేఖరరెడ్డి స్మృతి వనం కోసం ప్రభుత్వం హైదరాబాద్‌లో 20 ఎకరాలు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు. లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయలకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య... ఐమాక్స్ ధియేటర్ పక్కన వైఎస్ స్మృతి వనం కోసం ప్రభుత్వ స్థలం ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌కు ప్రభుత్వపరంగా గౌరవ ప్రదమైన స్థానం దక్కలేదని... ఆ స్థలం ఇప్పుడు ఏమైందని సూటిగా ప్రశ్నించారు. యూపీఏ హయాంలో వైఎస్... కేసీఆర్‌కు కేంద్రమంత్రి, హరీశ్‌రావుకు రాష్ట్రమంత్రి పదవి ఇప్పిస్తే ఎందుకు మర్చిపోయారని ఆక్షేపించారు. ఇప్పటికైనా నగరంలో సెంట్ భూమి ఇవ్వలేరాని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్... ఆంధ్రా సంస్థలను మూసివేస్తామంటూ టెర్రరిస్టు తీరులో మాట్లాడి రెచ్చగొట్టారని విమర్శించారు. ఆ సమయంలోనే తెలంగాణ రావాలంటే వీసా అవసరమా అని వైఎస్ వ్యాఖ్యానించారని అన్నారు. చనిపోయిన తర్వాత రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ అవమానించిన విషయం నిజం కాదా అని మండిపడ్డారు. కేసీఆర్ కూడా వైఎస్‌ఆర్‌కు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక... అప్పుడు రోశయ్య సర్కారు ఇచ్చిన భూమిని లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయ సమీకరణాలన్నీ మారతాయని... రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ చేస్తుందని షర్మిల పేర్కొన్నారు.
వైఎస్ఆర్ స్మృతి వనం కోసం 20 ఎకరాలు కేటాయించాలి. కాంగ్రెస్ హయాంలో రోశయ్య.. ఐమ్యాక్స్ వద్ద స్థలం ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయ సమీకరణాలు మారతాయి. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైతెపా పోటీ చేస్తుంది. - వై.ఎస్.షర్మిల, వైఎస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు
Sharmila on Vijayamma resign: వైకాపా గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేయడంపై వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల సమాధానం దాటవేశారు. ఎక్కడో ఏదో జరిగిందని దానిపై ప్రశ్నలు వేయడం సబబు కాదని షర్మిలా అన్నారు. ఇడుపులపాయలో.. వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ, జగన్‌ను కలిశారు కాబట్టి పొరపచ్చాలు తొలగినట్లేనా అన్న ప్రశ్నకు.. షర్మిలా అలాగే స్పందించారు. రాజశేఖరరెడ్డి వారసులు ఎవరన్న ప్రశ్నకు కూడా.. ఆమె జవాబు దాటవేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావోత్సవాన పార్టీ కార్యాలయంలో షర్మిల జెండా ఎగురవేసి.... వైస్సార్‌కు నివాళులు అర్పించారు.