Youngsters Into Cloud Kitchen Business : బీటెక్ పూర్తి కాకుండానే ధైర్యంగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు ఈ వైజాగ్ యువకులు. ఆలోచనను సమర్థంగా అమలులో పెట్టి లాభాల బాటలో పయనిస్తున్నారు. రూ.60 వేల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టి నాలుగేళ్లకే రూ.9 కోట్ల టర్నోవర్‌కు చేర్చారు. వ్యాపారానుభవం లేకున్నా కలసికట్టుగా పని చేసి విజయం అందుకున్నారు. 'స్వాప్' ద్వారా ఇతర రాష్ట్రాల వారికీ పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులేస్తున్నారు.
విశాఖకు చెందిన ప్రవీణ్, అనురాగ్, వికాస్, రాకేశ్, జ్ఞానేశ్వర్ చిన్ననాటి నుంచే మిత్రులు. బీటెక్ చదివేటప్పుడు క్రమం తప్పకుండా జిమ్‌కెళ్లేవారు. ఆ సమయంలో సరైన పోషకాహారం లభించక, సొంతగా ఎలా తయారు చేసుకోవాలో తెలీక ఇబ్బందులుపడ్డారు. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్‌లలో పోషకాహారం అందించే రెస్టారెంట్ల కోసం అన్వేషించారు. అది తప్ప అన్ని రకాల ఆహార పదార్థాలూ దొరుకుతున్నాయని అప్పుడే వారికర్థమయ్యింది.
18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..
జిమ్‌కి వెళ్లేవారిలో చాలా మంది ఇదే సమస్యతో సతమతవుతూ ఉండవచ్చేమో అనుకున్నాడు ప్రవీణ్. ఆరోగ్యకర పోషకాహారాన్ని ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా అందజేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఇదే మాట స్నేహితులకూ చెప్పాడు. వారికీ ఈ ఆలోచన నచ్చడంతో ఇందుకు ఆమోదం తెలిపారు. అలా 2019లో ఇంజినీరింగ్ చివరి ఏడాదిలో ఉండగానే 'స్వాప్' అనే పేరుతో క్లౌడ్ కిచెన్ ఆరంభించారు.
"మేము ఇంజినీరింగ్ చదివేటప్పుడు జిమ్‌కి వెళ్లేవాళ్లం. మాకు డైట్ ఫాలో కావడానికి అవసరమయ్యేవి వండుకోవాలి అంటే సమయం ఉండేది కాదు. దానికి సంబంధించినవి వేతికితే ఏవీ ఉండేవీ కాదు. అప్పుడు వచ్చింది ఈ ఆలోచన. మాలాంటి వాళ్లకు అవసరమయ్యేందుకు క్లౌడ్ కిచెన్ పెట్టాలి అని. పెట్టాక చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ అన్నీ ఎదుర్కొని ఇప్పుడు విజయం వైపు వెళుతున్నాం." - ప్రవీణ్, స్వాప్ వ్యవస్థాపకుడు
రుచితోపాటు ఆరోగ్యం పెంచే ఆహారం అందించాలనుకున్నారు ఈ మిత్రులు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మెచ్చేలా ఆరోగ్యహితమైన ఆహారం స్వాప్ ద్వారా అందిస్తున్నారు. మొదట్లో జిమ్‌కు వెళ్లే వాళ్లనే లక్ష్యంగా చేసుకున్నా, తర్వాత అందరినీ దృష్టిలో ఉంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. అందుకే వినూత్న పోషకాహార రుచులతో తక్కువ కాలంలోనే అందరి ఆదరణ దక్కించుకోగలిగారు.
Vizag Youth into Cloud Kitchen Business : చిన్నగదిలో రూ.60 వేల పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం కరోనా సమయంలో బాగా పుంజుకుంది. వీరి పదార్థాలు విస్తృత ఆదరణను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈనాడు వ్యాపారాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 అవుట్ లెట్లకు విస్తరించగలిగారు. 4 ఏళ్లలోనే సుప్రసిద్ధ రెస్టారెంట్లకు పోటీ స్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నారు.
వీరంతా అందరిలాగానే జీతాలు తీసుకుంటున్నారు. వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెడుతూ వివిధ ప్రాంతాల్లో అవుట్ లెట్స్‌ను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్, విజయవాడల్లో వీరికి శాఖలున్నాయి. ముఖ్య నగరాల్లోనే ఉన్న వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు సన్నద్ధమవుతున్నారు. త్వరలో బెంగళూరులో మరో క్లౌడ్ కిచెన్‌ను తెరవబోతున్నారు.
సమష్టిగా ప్రణాళికను ఆచరణలో పెట్టి వ్యాపారం అభివృద్ధి చేస్తున్నారు ఈ మిత్రులు. ప్రస్తుతం స్విగ్గి, జొమాటోలతో పాటు తమ సొంత వెబ్ సైట్ ద్వారా విక్రయాలు చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ పద్ధతి వల్ల బిజినెస్‌ను త్వరగా విస్తరించగలిగామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పని చేసి వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తామంటున్నారు.