Student killed his friend for Lover In Abdullahpurmet : ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఏకంగా స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హరహరకృష్ణ.. అతని స్నేహితుడు నవీన్‌ను పాశవికంగా హత్యచేశాడు.
గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో హరికృష్ణ, నవీన్, ఓ యువతి క్లాస్‌మేట్స్. నవీన్, హరహరకృష్ణ ఇద్దరూ ఈ అమ్మాయినే ప్రేమించారు. అయితే ఆ యువతి మాత్రం నవీన్‌తో చనువుగా ఉండేది. దీనిని జీర్ణించుకోలేని నిందితుడు హరహరకృష్ణ.. నవీన్ హత్యకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్‌కు ఈ నెల 17 సాయంత్రం ఫోన్ చేసి ఓఆర్ఆర్ వద్దకు పిలిపించి.. చెట్లపొదలకు తీసుకెళ్లి నవీన్‌ను హత్య చేశాడు.
నవీన్ ఆచూకీ కనిపించడం లేదని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు జరిపిన దర్యాప్తులో హత్య కుట్ర బయటపడింది. నల్గొండలోని మహత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నవీన్ ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి కాలేజీకి రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో అన్ని చోట్లా ఆరాతీసిన వారు 22వ తేదీన నార్కట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసుల నవీన్ స్నేహితులను ప్రశ్నించగా హరహరకృష్ణ వర్సిటీ నుంచి నవీన్ బయటకు వెళ్లాడని వారు తెలిపారు. 19వ తేదీన హరహరకృష్ణకు ఫోన్ చేయగా.. 17నే తన దగ్గరికి వచ్చి అదేరోజు తిరిగి వెళ్లాడని చెప్పాడు. దీంతో హరహరకృష్ణపై అనుమానం వచ్చి నార్కట్‌పల్లి పోలీసులకు తెలిపారు. పోలీసులు హరహర కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా.. నవీన్‌ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. "ఈనెల 17న యువతి విషయంలో నవీన్, హరహరకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కిందపడిన నవీన్‌ను గొంతు పట్టి హరహరకృష్ణ ఊపిరాడకుండా చేశాడు. డీమార్ట్‌లో 2 నెలల క్రితమే నిందితుడు కత్తిని కొనుగోలు చేసి.. పాశవికంగా హత్య చేసినట్లు" పోలీసులు తెలిపారు.
"17 తేదీన హరహరకృష్ణ పిలిస్తే నవీన్ వెళ్లాడు. వెళ్లి రెండురోజులు అయినా ఇంటికి రాకపోవడంతో 19వతేదీ రాత్రి వాళ్ల స్నేహితులకు కాల్ చేస్తే.. అసలు నవీన్ అక్కడికి రాలేదని చెప్పారు. అదేరోజు నవీన్ వాళ్ల బాబాయ్ చనిపోవడంతో.. నవీన్ తన ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాడనుకుని పట్టించుకోలేదు. కానీ 20వ తేదీకి కూడా నవీన్ ఆచూకీ తెలియకపోవడంతో తన ఫ్రెండ్స్‌కు కాల్ చేశాం. వాళ్లు హరహరకృష్ణ నంబర్ ఇస్తే ఫోన్ చేశాం. అతడు నాకు తెలియదని సడెన్‌గా ఫోన్ కట్ చేశాడు. మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది." - మృతుని బంధువు
ఇవీ చదవండి: