ఏపీ విశాఖపట్నంలోని గీతం విద్యాసంస్థలపై వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు ఫిర్యాదు చేశారు. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ విశ్వవిద్యాలయం నిబంధనలు ఉల్లఘిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి.సురేష్‌కు ఆరు పేజీల లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వానికి చెందిన భూములను గీతం విద్యా సంస్థల యాజమాన్యం ఆక్రమించిందని లేఖలో పేర్కొన్నారు. ఆక్రమించిన భూమిలోనే ఫార్మసీ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. సరైన విద్య, శిక్షణ ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్రమైన లోపాలున్నాయని చెప్పారు. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తప్పుడు సమాచారాన్ని గీతం సమర్పించిందని వివరించారు. గీతం విద్యా సంస్థలపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిబంధనల ఉల్లంఘనపై వాస్తవాలు తేల్చేందుకు కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు గీతంలో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులకు అనుమతి రద్దు చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో కోరారు.
ఇదీ చదవండి: ఆత్మహత్యాయత్నం చేసిన భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి