తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఉత్కంఠ నెలకొంది. వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా ప్రజా సదస్సును ఇక్కడ నిర్వహించనున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఈ సభలో సుమారు 20 వేల మంది ప్రజలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు మంత్రులు వివరిస్తారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
తెదేపా నేతల ఆగ్రహం
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత గ్రామంలో మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా సభ పెట్టడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారావారిపల్లి గ్రామస్థులు అమరావతి రైతులకు మద్దతుగా శాంతియుత నిరసన తెలపడానికి చంద్రగిరి పోలీసులను అనుమతి కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. మొత్తంగా నారావారిపల్లెలో వైకాపా సభ, తెదేపా నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'