YCP LEADER ILLEGAL REGISTRATION :మూడు దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని కొందరు వైసీపీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ వితంతు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని తహశీల్దార్ వద్దకు వెళ్తే.. ఆయన కూడా వైసీపీ నాయకులకే మద్దతుగా మాట్లాడుతున్నారని వాపోయింది. పొలంలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారన్న మహిళ.. తమకు న్యాయం చేయాలని కోరుతోంది.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడుకు చెందిన ప్రత్తిపాటి శ్రీశైలం, రాంబాబు అన్నదమ్ములు. వీరికి గ్రామ సర్వే నంబర్ 152-2b, 153-2b లో ప్రధాన రహదారిని ఆనుకొని ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. రాంబాబు తన వాటా మూడెకరాలు1993లో సోదరుడు శ్రీశైలంకు విక్రయించాడు. తరువాత జాతీయ రహదారి రావడంతో భూముల ధరలు పెరిగాయి. దీంతో స్థానిక వైసీపీ నాయకుడు దారెడ్డి శివశంకర్‌రెడ్డి సదరు భూమిని తనకు అమ్మాలని అప్పట్లో అడగ్గా శ్రీశైలం అంగీకరించలేదు.
అనారోగ్యంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం మృతి చెందాడు. ఆయన భార్య భ్రమరాంబ కుమారులతో కలిసి పొదిలిలో నివాసం ఉంటున్నారు. ఇదే అదునుగా భావించిన శివశంకర్‌రెడ్డి చక్రం తిప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీశైలం సోదరుడు రాంబాబుకు డబ్బు ఆశ చూపాడు. అధికారుల సహకారంతో భ్రమరాంబ పేరిట ఉన్న భూమిని రాంబాబు పేరిట గత నెలలో ఆన్‌లైన్ ఎక్కించారు.
"మా ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయ్యింది. నేను నా పిల్లల్ని తీసుకుని పొదిలిలో ఉంటున్నాను. పొలం కౌలుకు ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో బతుకుతున్న. ఇప్పుడు నాకు తెలియకుండా 5 ఎకరాల పొలాన్ని ఆన్లైన్లో రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. నేను ఎమ్మార్వో ఆఫీసుకు పోతే.. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరిస్తున్నారు. నా పొలాన్ని ముగ్గురు కౌలుకు చేస్తున్నారు. అందులో సుబ్బయ్య అనే వ్యక్తే మొత్తం చేశాడు. నాకు తెలియక బ్యాంకుకు సంబంధించిన అన్ని పత్రాలను ఆయనకు ఇచ్చాను. ఇప్పుడు వైసీపీ నాయకుడు నన్ను బెదిరిస్తున్నాడు. పొలంలోకి వస్తే చంపెస్తామంటున్నారు" -భ్రమరాంబ, బాధితురాలు
ఈ నెల 5 న శివశంకర్‌రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో ఆన్‌లైన్‌లోనూ వివరాలు మారిపోయాయి. విషయం తెలుసుకున్న బాధితురాలు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి.. 2022 నవంబర్ 22 వరకు తమ పేరిటే భూమి ఉందని ఆధారాలను చూపించారు. ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు.
వైసీపీ నాయకుడు శివశంకర్‌రెడ్డిని తహశీల్దార్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడగా.. భూమి తన పేరిట రిజిస్ట్రేషన్ అయిందని.. మీకు సంబంధం లేదంటూ బెదిరించారని బాధిత కుటుంబం చెప్తోంది. పొలంలోకి వస్తే చంపేస్తామని హెచ్చరించారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: