Bankhui mine : ఒడిశా రాష్ట్రంలోని బాంఖుయ్ గని చివరకు యజ్దాని స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకొంది. ఈ బొగ్గు గని కేటాయింపునకు మంగళవారం వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో సింగరేణితో పాటు తమిళనాడుకు చెందిన జెన్కో, ఒడిశాలోని ఇనుప గనుల తవ్వకాలను నిర్వహిస్తున్న ప్రైవేటు కంపెనీ యజ్దాని పాల్గొన్నాయి. 800 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న ఈ గని కేటాయింపులను పొందేందుకు మూడు కంపెనీలు ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో పాల్గొనగా.. చివరకు యజ్దాని స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకొంది. మిగిలిన రెండు కంపెనీల కన్నా కేంద్ర మంత్రిత్వ శాఖకు ఎక్కువ మొత్తాన్ని ఇవ్వజూపడంతో ఆ కంపెనీకే ఈ గనిని అప్పగించింది. ఆదాయంలో 18 శాతం ఇచ్చేందుకు యజ్దాని సంస్థ అంగీకరించడంతో బాంఖుయ్ గనిని సదరు కంపెనీ దక్కించుకొన్నట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నియమించిన ప్రత్యేకాధికారి గురువారం ప్రకటించారు.
కోయగూడెం బ్లాక్-3 బిడ్డింగ్‌కు సాంకేతిక ఆమోదం!
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గత నెల 31న నిర్వహించిన వేలం ప్రక్రియలో సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాక్-3 గనిపై ఒకే ఒక బిడ్డర్ ఆసక్తి చూపినప్పటికీ దానికి ఆమోదం తెలుపుతూ సాంకేతిక కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 88 బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహించింది. వాటిలో సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు- ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్-3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్-3, మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్‌పల్లి బ్లాక్-3, కళ్యాణిఖని-6 ఉన్నాయి. కోయగూడెం బ్లాక్-3కి ఆరో కోల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బిడ్డింగ్‌లో పాల్గొంది. ఈ నెల 4న నిర్వహించిన టెక్నికల్ ఎవల్యూషన్ కమిటీ సమావేశంలో సింగిల్ బిడ్డింగ్ వచ్చిన గనులపై చర్చించారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న సింగిల్ కంపెనీలకు సాంకేతికంగా ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాక్-3 చేజారే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చూడండి : కొన్నది నువ్వే.. ఉన్నది ఎవరో: స్థలం కొనుక్కున్న వారికి చుక్కలు