Yasangi Paddy: ప్రస్తుత యాసంగిలో రాష్ట్రంలో 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభం కాగా ఏప్రిల్ మొదటివారానికల్లా అన్ని ప్రాంతాల్లో ముమ్మరం కానున్నాయి.ఉప్పుడుబియ్యం తీసుకునేది లేదని కేంద్రం చెప్పడంతో ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలనీ సూచించింది. అయినప్పటికీ రైతులు 35.84 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొనకపోతే ధాన్యాన్ని విక్రయించడం ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్‌లో కొనుగోలు చేసిన విధంగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా కోరుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్‌లో వెల్లువలా...
గతేడాది యాసంగిలో మాదిరిగా గ్రామాల్లో, సమీపంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే రవాణా, ఇతర ఖర్చుల పేరిట రైతులకు క్వింటాకు రూ.100కి పైగా అదనపు భారం తప్పదు.ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే తరుగు పేరుతో మరింత నష్టపరుస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు లేదా ఇతర వ్యాపారులు మద్దతు ధరకు కొనడం అసాధ్యమని అంచనా. మిల్లర్లు 15 లక్షల నుంచి 20 లక్షల టన్నులకు మించి సొంతంగా కొనరని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర అవసరాలకు మరో 15 లక్షల టన్నులు పోయినా కనీసం 40 లక్షల టన్నులనైనా కేంద్రం కొనాల్సి ఉంటుంది. ఏప్రిల్ మొదటివారానికి మార్కెట్లకు ధాన్యం వెల్లువలా రానుంది.
రైతులకు నష్టం..
ఈ నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకోకపోతే వ్యాపారులు ఇదే అదనుగా ధర తగ్గించి కొని రైతులను నష్టపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. 1 నుంచి 5 ఎకరాల్లో సాగుచేసే చిన్నరైతులే ఎక్కువమంది ఉంటారు. వారు అప్పులు తెచ్చి పంట సాగు చేస్తారు. అయినకాడికి తెగనమ్మి అప్పులు తీర్చాలనే వారి ఆరాటాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు క్వింటాకు రూ.200 నుంచి 300 దాకా తగ్గించి కొంటారు. ఎకరానికి కనిష్ఠంగా రూ.6 వేల నష్టం చొప్పున లెక్కించినా 35.84 లక్షల ఎకరాలకు రైతులు నష్టపోయే సొమ్ము రూ.2,150 కోట్లకు పైగా ఉంటుంది.
సాధారణ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వటంలోనూ మిల్లర్లు తాత్సారం చేస్తున్నారు. గడిచిన ఏడాది (2021) మార్చితో ముగిసిన యాసంగి సీజనుకు సంబంధించిన 10.81 లక్షల మెట్రిక్ బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి. అందులో సుమారు 7.70 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ బియ్యం. 3.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం. సాధారణ బియ్యం ఇవ్వటంలోనూ మిల్లర్లు జాప్యం చేస్తున్నారు.ఎఫ్‌సీఐకి 6.58 లక్షల మెట్రిక్ టన్నుల, రాష్ట్ర ప్రభుత్వానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం ఇవ్వాల్సి ఉంది. యాసంగిలో 10.81 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు.
2020-21 యాసంగిలో 20 వేల మెట్రిక్ టన్నులకుపైగా బియ్యం నిల్వలు మిల్లర్ల వద్ద ఉన్న జిల్లాల వివరాలు