అవినీతి నిరోధక సంస్థ అధికారులు.. కేవలం వారికి వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే కాకుండా.. వాళ్లే స్వతహాగా నిఘా పెట్టి అవినీతి పరులను పట్టుకునే పద్ధతి వస్తే బాగుంటుందని సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ అన్నారు. దీనికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు.. బాధితులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో సంస్థ వాలంటీర్లు వారి ప్రాణాలను లెక్క చేయకుండా ఆపదలో ఉన్న వారికి వెళ్లి మందులు అందించారని తెలిపారు. వారి సేవలను అభినందిస్తూ హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పరివర్తన కలిగించాలి
అవినీతికి పాల్పడే వ్యక్తుల్ని వదిలేయకుండా వారిని కూడా అవినీతి నిరోధక సంస్థల సభల్లో మాట్లాడిస్తూ భాగస్వాముల్ని చేస్తే వారిలో కూడా మార్పు తీసుకురావొచ్చని ఆర్పీ సూచించారు. వచ్చే సంవత్సరం సంస్థ సభ్యులని రెండింతలుగా పెంచి మరింత మందికి చేరువయ్యేలా చేయాలని హాజరైన ప్రముఖులు అన్నారు. 'అవినీతి సమస్యలు వాటిపై సాధించిన విజయాలు.. ఆర్టీఐ చట్టం సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది' అనే విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జైల్ సూపెరింటిండెంట్ శివకుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'కవిత కంటే అర్వింద్ ఒక్కశాతం పనెక్కువ చేసినా రాజీనామా చేస్తా'