దేశంలో యువతకు వ్యవసాయ రంగమే ఏకైక ప్రత్యామ్నాయం కావాలని అమెరికాలోని ఓహియో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ప్రముఖ శాస్త్రవేత్త వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డాక్టర్ రతన్‌లాల్ అన్నారు. భారత్‌లోని యువత.. రైతులు లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాజేంద్రనగర్ జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థలో ఆన్లైన్ వేదికగా జరిగిన 111వ ఫోకార్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్లీ నుంచి భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌లు డాక్టర్ ఎస్కే చౌదరి, డాక్టర్ ఆర్సీ ఆగర్వాలు, మండలి అనుబంధ జాతీయ పరిశోధన సంస్థల అధిపతులు, శాత్తవేత్తలు పాల్గొన్నారు.
భారత్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రైతుల ఆదాయం రెట్టింపు, విధానపరమైన నిర్ణయాలు.. తదితర అంశాలపై విస్త్రతంగా చర్చించారు.
నానాటికీ భూమి సారం కోల్పోతుండటం, భూగర్భజలాల కొరత, వాతావరణ మార్పులు వంటి పరిణామాలతో వ్యవసాయ ముఖచిత్రం మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లి రైతులతో మమేకమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులుపరిశీలించడం ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని శాస్త్రవేత్తలకు సూచించారు. అదేవిధంగా నార్మ్లో 111వ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందబోతున్న 17 రాష్ట్రాలకు చెందిన 37 మంది యువ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నేల ఆరోగ్యం, నీటి నిర్వహణ వంటి అంశాలతో పాటు ఆహార వృథా తగ్గింపుపై దృష్టిసారిస్తేనే దేశానికి మేలు చేకూరుతుందని నార్మ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అన్నారు.
- ఇదీ చదవండి:సామాన్య మహిళల అసామాన్య పోరాటం