మరికొన్ని వారాల పాటు.. వర్క్ ఫ్రం హోమ్!! తప్పదు!! అన్నీ బ్యాలెన్స్ చేస్తూనే ల్యాపీ ముందేసుకుని పని చేయాల్సిందే. ఇప్పటికే ఇంటిపట్టునే ఉండి పని చేయడంలో లోపాలు.. ఒత్తిళ్లు ఎదురయ్యే ఉంటాయి కదా! అనుకోకుండా టీఎల్ కాన్ఫరెన్స్ కాల్.. ఏదో సందేహం అంటూ కొలీగ్ వాట్సాప్ వీడియో కాల్.. చెబుతూ వెళ్తే మీ వర్క్ ఫ్రం హోమ్ అవతారాన్ని చూసి చాలా మంది షాక్ అయ్యుంటారు.
‘ఏంటీ... నువ్వు ఇంట్లో ఇలా ఉంటావా?’ అని ఫన్నీగా ఏడిపించిన సందర్భాలూ ఎదురై ఉండొచ్చు. బాస్.. ఇంకాస్త అసహనంతో ‘ఆ అవతారం ఏంటి? అలా పనిలోకి దిగితే.. రిజల్ట్ ఇలాగే ఉంటుంది’ అని కాల్ కట్ చేసి కూడా ఉండొచ్చు.. ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా మీకు అనిపించే ఉంటుంది. ఇంట్లో ఉండి పని చేసినా కూడా.. అందుకో ‘డ్రెస్ కోడ్’ ఉండాల్సిందే అని. యెస్.. కరెక్టే!! అనిపించడమే కాదు. అదే నిజం.. ఉత్సాహంతో పని చేసేందుకు తగిన డ్రెస్ కోడ్ ఉండాల్సిందే అంటున్నారు సైకాలజీ నిపుణులు.. ‘డ్రెస్ యువర్ బెస్ట్ లైఫ్..’ అంటూ కొందరు పుస్తకాలు కూడా రాశారు.. మరైతే, ఈ లాక్‌డౌన్ రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ జోన్‌లో ఉన్న యువత ఎలాంటి ఫ్యాషన్ చిట్కాల్ని ఫాలో అవ్వాలో చూద్దాం!!
పనిమంతులుగా మారాలి
ఆఫీస్‌కి వెళ్లాల్సిన పనిలేదు. పొద్దెక్కి లేచినా లాగిన్ టైమ్‌కి ల్యాపీ ముందేసుకుని కూర్చుంటే చాలు అనుకుంటారు చాలా మంది. అదీ వారంలో ఎప్పుడో ఒక రోజైతే ఫర్వాలేదు. మిగతా రోజులన్నీ పనిమంతులుగా ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే? మీరు ఇంట్లో ఉన్నా ఆఫీస్‌కి వెళ్లినట్టుగానే చూడముచ్చటైన లుక్‌లో కనిపించాలి. ఊరంతా చూసేందుకు కాదు. మిమ్మల్ని మీరు చూసుకుని మంచి మూడ్‌తో పనిలోకి దిగేందుకు. ఎందుకంటే.. మీరెంత చక్కగా సిద్ధం అయితే.. మీ పనుల్లో అంతే వేగం ఉంటుంది. అందుకే ఇంట్లో లుక్‌కి కాస్త ఆఫీస్ టచ్ ఇవ్వాలి. ఫార్మల్ చొక్కా, కాటన్ జీన్స్‌తో పైన టై కట్టి టక్ చేసుకుని కూర్చోవాలా? అనేరు!! అవసరం లేదు. మీరు ధరించే దుస్తులు అటు ఆఫీస్‌లుక్‌కి ఇటు ఇంటికీ సరిపోయేలా చూసుకోండి చాలు. ఎలాగంటే.. మీకు నచ్చిన ఏదైనా టీషర్టు వేస్తారుగా. దానిపై బ్లేజర్ వేయండి. అనుకోకుండా ఎలాంటి కాన్ కాల్స్ వచ్చినా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడొచ్చు. ఇంట్లో బ్లేజర్ ఎందుకు వేసుకోవడం అనిపిస్తే.. మీ వర్క్ టేబుల్ పక్కనే బ్లేజర్ అందుబాటులో ఉండేలా చూసుకోండి.
మీదైన స్లోగన్‌తో..
ఇంకెన్నాళ్లీ నాలుగు గోడల జీవితం అనుకుంటూనో.. కెఫెటీరియా కాఫీ జోకులు గుర్తొచ్చో.. ఆందోళన, ఒత్తిడిలోకి వెళ్లకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరే ఉత్సాహపరుచుకునేందుకు మీకు ఇష్టమైన ‘స్లోగన్ టీ షర్టు’లు ధరించొచ్చు. అవి మీలోని ఆత్మవిశ్వాసాన్ని తెలిపేలా ఉండాలి. ఉదాహరణకు మీరో టీమ్ లీడర్ అయితే.. బృందంతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడేటప్పుడు బృందంలో స్ఫూర్తి రగిలించేలా మంచి కొటేషన్ ఉన్న టీషర్టుని ధరించండి. అది గమనించిన బృందం మీ పాజిటివ్ వైఖరిని క్షణాల్లో అర్థం చేసుకుంటారు. అప్పుడప్పుడు ఫన్ స్లోగన్ టీషర్టులతోనూ మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకోవచ్చు.
ప్యాంటుల మాటేంటి?
కొన్ని గంటల పాటు కూర్చుని పని చేయాలి? అదీ ఇంట్లో.. అప్పుడు కచ్చితంగా కంఫర్టు గురించి ఆలోచిస్తూనే మీదైన స్టైల్‌ని ప్రదర్శించాలి. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకూ ఒక చోటే కూర్చోవడం.. ఎప్పుడంటే అప్పుడు కాల్స్ మాట్లాడడం. అందుకే కాస్త అనువుగా ఉండే ‘డ్రాస్ట్రింగ్ ట్రౌజర్స్’ని ప్రయత్నించొచ్చు. ఎలాస్టిక్‌తో తయారు చేయడం వల్ల సాగుతూ వదులుగా, సౌకర్యంగా ఉంటాయి. అనేక రకాల డిజైన్స్‌తో, విభిన్న మెటీరియల్స్‌తో ఈ ప్యాంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే అదిరే స్టైల్‌ని కోరుకునే యువత ఉన్ని, లెనెన్ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన ట్రౌజర్స్‌ని వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు మీ బీరువాలో సౌకర్యవంతమైన చీనోస్, స్లిమ్ ఫిట్ రా డెనిమ్స్, కార్‌డ్రాయ్ ట్రౌజర్స్‌ని ఎంచుకోవచ్చు. అమ్మాయిలకైతే కాలర్ డ్రస్సులు, స్కార్ఫ్‌తో కూడిన స్కట్‌లు హుందాగా కనిపిస్తాయి.
‘కంఫర్ట్ కోడ్’ ఉండాలి...
ఉదయం యోగా చేసేందుకో.. హోం జిమ్‌లో వర్క్‌అవుట్స్ చేసేందుకు ట్రాక్ సూట్‌లు ధరిస్తారు. వాటితోనే కాఫీ తాగుతూ సరాసరి వర్క్ స్టేషన్‌లో కూర్చోవడం కరెక్టు కాదు. పైగా ఎక్కువ సమయం పాటు టైట్‌గా కండరాల్ని కష్టపడేలా ఉన్నవి ధరించడం మంచిది కాదు. కంఫర్ట్‌గా అనిపించవు.. ఇంట్లో ఉన్నప్పుడు కచ్చితంగా వదులుగా ఉన్నవి ధరించే పని ప్రారంభించండి. పైగా ఇప్పుడున్న వేసవి వేడికి అవే అవసరం. అందుకే ‘బాగీ టీ షర్ట్’ లను ప్రయత్నించండి. వదులుగా ఉండటం వల్ల సౌకర్యంగా ఉంటాయి. అంతేకాదు.. మీరేదైనా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు హుందాగా కనిపిస్తారు కూడా. వీటితో పాటు మీ క్యాజువల్ వేర్‌లోని ‘లాంగ్ స్లీవ్ టీ షర్ట్‌లు, పోలోస్, క్రూ నెక్ టీ’లు కూడా ఎంచుకోవచ్చు. అప్పుడప్పుడు షర్టులతో మరింత ప్రొఫెషనల్‌గా వీడియో కాల్స్‌లో కనిపించేందుకు ‘బటన్ డౌన్ షర్ట్స్’ కూడా ప్రయత్నించొచ్చు.
‘ఇమేజ్’ పెంచేలా..
ఆఫీస్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్‌లా కనిపిస్తూ మీ కంటూ ఓ ఇమేజ్‌ని సంపాదించుండొచ్చు. మరి, లాక్‌డౌన్‌లో ఆ ఇమేజ్‌ని కాపాడుకోవాలంటే? ఇంట్లో ఏం ధరిస్తున్నాం? ఎలా కనిపిస్తున్నాం? అనే విషయంలో కాస్త ధ్యాస పెట్టాలి. లాగిన్, లాగవుట్‌ల మధ్య మీదైన వృత్తి నిబంధనలు పాటించాలి. పదే పదే ధరించిన వాటినే ధరించొద్దు. రాత్రి సమయంలో ఏదైనా కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడాల్సి వస్తే.. నైట్‌వేర్‌లో కనిపించొద్దు. పైజామాలు ఎంచుకోవచ్చు. వాటితో సంప్రదాయ లుక్‌తో పాటు కంఫర్ట్ కూడా ఎక్కువే.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు