సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ప్రతిఘటన మహిళా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలతో కలసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆదర్శ మహిళలను హోం మంత్రి అలీ సన్మానించారు.
మాతృమూర్తిని ఆరాధించాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు పోలీసు శాఖలో 32 శాతం, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 55 శాతం పదవులను కేటాయించామని పేర్కొన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాతృమూర్తిని గౌరవించాలని మంత్రి సూచించారు. ఎక్కడికెళ్లినా వారి ఆశీర్వాదం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇదే బాటలో నడుచుకుంటున్నానని హోంమంత్రి వెల్లడించారు.