మహిళా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే కళాశాలల్లో 'భద్రతా క్లబ్బు'లు ఏర్పాటు చేసింది. వీటి ప్రారంభ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా పాల్గొన్నారు.
ప్రయోగాత్మకంగా భద్రత క్లబ్బులు
హైదరాబాద్‌లోని 5 కళాశాలల్లో ప్రయోగాత్మకంగా భద్రత క్లబ్బులను ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రుక కళాశాల, అరోరా పీజీ కళాశాల, శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాల, జాగృతి డిగ్రీ కళాశాలల్లో వీటిని ప్రారంభించారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో ఈ క్లబ్బులపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.
45మందితో ఒక క్లబ్బు
ప్రతి కళాశాలలో 45మంది విద్యార్థులు కలిసి క్లబ్బుగా ఏర్పడతారు. వీరిలో విద్యార్థినిలతోపాటు విద్యార్థులు కూడా ఉంటారు. ఈ క్లబ్బుకు షీబృందాలు దిశా నిర్దేశం చేస్తాయి. కళాశాల యువతులు ఎదుర్కొనే ఇబ్బందులపై క్లబ్బులోని సభ్యులకు అవగాహన కల్పిస్తారు. షీ బృందాల ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి శిక్షణ ఇస్తారు. న్యాయ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తారు. మహిళా భద్రతా విభాగం పనితీరు గురించి పూర్తి వివరాలు క్లబ్బులకు తెలియజేస్తారు.సేవ్ ద చిల్డ్రన్, లీడ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థలు వీరికి సహకారం అందిస్తున్నాయి.
కళాశాలలు- షీబృందాలకు వారథులు
కేవలం కళాశాలలోనే కాకుండా ఇంటి వద్ద, చుట్టుపక్కల మహిళలకు ఇబ్బంది తలెత్తితే పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకుంటారు. వీలైతే సంఘటనా స్థలంలోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. లేకపోతే సంబంధిత షీ బృందాల దృష్టికి తీసుకెళ్తారు. కళాశాలలు, షీ బృందాలకు.. ఈ క్లబ్‌లు వారథిగా పనిచేయనున్నాయి. ఉత్తమంగా పనిచేసే క్లబ్బులను ప్రోత్సహించడానికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.
సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు
స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికి ధైర్యంలేని బాధితులు... నేరుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించామని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో 9441669988 వాట్సాప్ నంబర్ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయిన ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయోచ్చన్నారు. ఆపదలో ఉన్న ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: ఏప్రిల్ నుంచి జనాభా లెక్కల సర్వే