గతేడాది కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల... చాలా మంది ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉన్నారు. చిన్న తరహా వ్యాపారాలు మూతపడ్డాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చినికి చినికి గాలివానగా మారి... పెద్ద గొడవలకు దారి తీశాయి. ఫలితంగా బాధితులు ‘డయల్ 100’ను ఆశ్రయించారు. మహిళలపై మందుబాబుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఫలితంగా నగరంలో డయల్ 100 కు ఫిర్యాదులు పెరిగాయి. కేసుల్లో ఎక్కువగా గృహిణులపై వేధింపులు... బ్లాక్ మెయిలింగ్, వరకట్నం వేధింపులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది కేసులు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు.
ప్రత్యేక నిఘా
మహిళలపై వివిధ రకాల వేధింపులకు సంబంధించి వచ్చే డయల్ 100 కాల్స్‌పై.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్, జగద్గిరిగుట్ట, రాజేంద్రనగర్, మైలార్ దేవ్‌పల్లి, జీడిమెట్ల, నార్సింగి మొత్తం 6 ఠాణాల్లో మహిళా కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ఆయా ప్రాంతాల్లో వచ్చే ఫిర్యాదులను బట్టి.. షీటీమ్స్ వారి సమస్యలు తీరుస్తున్నారు. గతేడాది అన్ని వర్గాల ప్రజల నుంచి ఫిర్యాదులు అందగా.. ఇప్పుడు మాత్రం బస్తీల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని... సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనుసూయ తెలిపారు.
లాక్‌డౌన్ సడలింపుల వల్ల మళ్లీ మహిళలు ఉద్యోగాలకు, వివిధ రకాల పనులకోసం బయటకు వస్తున్నారు కాబట్టి షీ బృందాలు గస్తీ మొదలుపెట్టనున్నాయి. భరోసా సెంటర్లకు కూడా ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. వాటినీ పునఃప్రారంభించనున్నారు. మహిళలు తమకు ఎదురవుతున్న సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: weather report: స్థిరంగా అల్పపీడనం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం