Groom Mantras At Wedding : సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహాల్లో కచ్చితంగా పూజారి/ పంతులు ఉంటారు. ఆయన వేదమంత్రాలు చదువుతుండగా, వివాహ బంధంలోకి అడుగుపెడతారు నూతన వధూవరులు. ఏడడుగులు నడిచి తమ కొత్త జీవితాలను మొదలుపెడతారు. ఇది అనేక పెళ్లిళ్లలో మనం చూసే ఉంటాం.
కానీ ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమారుడే పంతులయ్యారు! స్వయంగా మంత్రాలు చదువుకుంటూ వివాహ తంతును పూర్తి చేశారు. అది కూడా మరో పూజారి పర్యవేక్షణలో వేద మంత్రాలు చదివారు. వివాహానికి చెందిన అన్ని ఆచార వ్యవహారాలు తెలిసిన ఆయనపై అనేక మంది ప్రశంసలు కురిపించారు.
సహరన్పుర్ జిల్లాలోని రాంపుర్ మణిహరన్కు చెందిన ప్రవీణ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్కు హరిద్వార్ జిల్లాలోని కుంజా బహదూర్‌పుర్ గ్రామ నివాసి అయిన అనిల్ కుమార్ కుమార్తెతో కొన్ని రోజుల క్రితం వివాహ సంబంధం నిశ్చయమైంది. ఇటీవల వివాహం జరిపించాలని నిర్ణయించుకోగా, వివేక్ కుమార్ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వెళ్లారు.
ఆ తర్వాత వేదికపై శుభ ముహుర్తంలో వధూవరులిద్దరూ పూలమాలలు మార్చుకున్నారు. ఆ తర్వాత హోమం చేసి, మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంది. అదే సమయంలో వరుడు తన వివాహ ఆచారాలను తానే నిర్వహిస్తానని పూజారికి చెప్పారు. మతపరమైన ఆచారాల మంత్రాలను కూడా తానే స్వయంగా పఠిస్తానని తెలిపారు.
అనంతరం వరుడు మంత్రాలు జపించడం ప్రారంభించగా, అందరూ చప్పట్లు కొట్టారు. వివాహ ఆచారాల మంత్రాలన్నింటినీ ఎలా పఠించాలో తెలుసని చెప్పారు వివేక్. మతపరమైన ఆచారాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే వేదమంత్రాలను పఠించడం నేర్చుకున్నానని వెల్లడించారు. మొత్తానికి వివేక్ వివాహం ఇప్పుడు చుట్టుపక్కప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.