బిడ్డకు పాలిస్తుండగా రొమ్ముపై పాము కాటేయగా తల్లి మరణించిన ఉదంతమిది. గ్రామ రెవెన్యూ అధికారి ఎస్.శ్రీధర్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర చంద్రాపూర్ మండలం సోనాపూర్ నుంచి కొందరు కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు. మిరప కోతలకు వెళుతూ గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆదమరచి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ... పక్కనే పడుకున్న పాపకు ఆకలైందేమో.. లేచి ఏడుస్తోంది. శ్రుతి ప్రమోద్ భోయర్ (21)కు వెంటనే మెలకువ వచ్చింది. బిడ్డను పొదివి పట్టుకుని తన స్తనం నోటికి అందించారు.
ఏడాదిన్నర వయసున్న పాప అమ్మపాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆకలి తీర్చుకుంటోంది. ఎక్కడ నుంచి వచ్చిందో పాము.. అప్పటిదాకా అక్కడే పొంచి ఉండి శ్రుతి రొమ్ముపై కాటేసింది. తనకేమన్నా అవుతుందేమో అనే బాధకంటే బిడ్డను పాము కాటేస్తుందోమేననే భయం ఆమెలో ఎక్కువైంది. వెంటనే ధైర్యం తెచ్చుకుని పామును చేతితో పట్టుకుని విసిరేసింది. ఆ క్రమంలో పాము ఆ పక్కనే నిద్రపోతున్న రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై పడి, అతడినీ కాటేసింది. వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. శ్రుతి చనిపోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. శ్రుతి మృతదేహానికి పరీక్షలు పూర్తయ్యాక బంధువులు స్వస్థలానికి తీసుకెళ్లనున్నారు.
ఇవీ చూడండి: గానుగ నూనెతో ఆరోగ్యం... భారీగా పెరుగుతున్న వాడకం