Woman Constable suicide in Hyderabad: మనసుకు నచ్చినోడితో ఏడు అడుగులు వేయాలని కలలు కన్నది. అగ్ని సాక్షిగా మంచి వ్యక్తిని.. భర్తగా పొంది ఆయనతో నూరేళ్లు జీవించాలని ఆశ పడింది. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకొని హాయిగా జీవించాలని ఎంతో ఆశగా ఎదురు చూసింది. ఈ క్రమంలో ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రెండు, మూడు సంబంధాలు చూశారు కానీ వివిధ కారణాలతో అవి కుదరలేదు.
తాజాగా తీవ్ర నిరాశలో ఉన్న ఆమెకు ఒక సంబంధం వచ్చింది. ఇరువురి కుటుంబాల ఆస్తి, అంతస్తులు కలిశాయి. అబ్బాయి, అమ్మాయి ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు. పెళ్లి కుదుర్చుకునే క్రమంలో పెద్దలు జాతకాలు చూశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్న ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తీరా చూస్తే జాతకాలు కలవట్లేదని చెప్పారు. దాంతో ఈ సంబంధం కూడా తప్పిపోతుందని మనస్తాపం చెందిన ఆ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జాతకాలు కుదరకపోవడంతో పెండ్లి జరగదేమోనని మనస్తాపంతో హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొంది. రంగారెడ్డి జిల్లా కందుకుర్ మండలానికి చెందిన డి. సురేఖ హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. 2018వ సంవత్సరంలో ఉద్యోగం సంపాదించిన ఆమె.. తన సోదరితో కలిసి కాల్వగడ్డ శంషీర్ గంజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. గత కొన్ని రోజుల నుంచి ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. ఏ ఒక్కటి కుదరడం లేదు. చివరి ఒక సంబంధం కుదిరి అబ్బాయి నచ్చడంతో ఎంతో సంతోష పడింది.
తీరా పెద్దలు జాతకాలు చూసి ఇరువురి జాతకాలు కుదరడం లేదని చెప్పడంతో మరి పెళ్లి కాదని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇవాళ తన సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఎవరు లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరవాత తన సోదరి ఇంటికి వచ్చే సరికి విగత జీవిగా ఫ్యాన్‌కు వేలాడుతోంది. బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న షా అలీ బండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామ నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇవీ చదవండి: