హైదరాబాద్ కొండాపుర్ రాఘవేంద్ర కాలనీ సుబ్బయ్య ఆర్చిడ్స్ బిల్డింగ్పై నుంచి దూకి నవవధువు శేష సంతోషి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన శేష సంతోషికి ఫిబ్రవరి నెలలో కోదాడకు చెందిన కోటేశ్వరరావుతో వివాహం జరిగింది. కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన కూతురి భర్త కోటేశ్వరరావు, అత్త, మామల వేధింపుల వలనే చనిపోయిందని మృతురాలి తండ్రి వెంకట్రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అదనపు కట్నం కోసం వేధించడం వలనే చనిపోయిందని ఆరోపించారు. భర్త, అత్త మామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన భర్త, అత్త మామల వేధింపుల వలనే చనిపోతున్నట్లు శేష సంతోషి రాసిన సూసైడ్ నోటు పోలీసులకు దొరికింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.