Rajyasabha Elections: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. తెరాస అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రమజీవి పార్టీ అభ్యర్థులు భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వారిని ప్రతిపాదించిన వారు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించారు.
తెరాస అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్లు ధ్రువీకరించిన అధికారులు.. వారిద్దరు మాత్రమే బరిలో ఉన్నట్లు ప్రకటించి.. వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నుంచి పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు ఎన్నిక ధ్రువీకరణ పత్రం పొందారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, తదితరులు వెంట ఉన్నారు. ఈనెల 24న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగిసిన తర్వాత... పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు పదవీకాలం ప్రారంభం కానుంది. ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యులుగా కొనసాగనున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు పార్థసారథి రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు.. బండ ప్రకాశ్(ప్రస్తుతం ఎమ్మెల్సీ) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికకు గాయత్రి గ్రానైట్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.
ఇవీ చదవండి: