ఏడు నెలల తరవాత నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అవుట్ పేషెంట్(ఓపీ) విభాగాలు రద్దీగా కన్పిస్తున్నాయి. చలికాలం వైరస్ వ్యాప్తికి మరింత అనువుగా ఉంటుందని ఓ వైపు నిపుణులు చెబుతున్నా ఓపీ కార్డు తీసుకునే దగ్గర నుంచి వైద్యుణ్ని సంప్రదించడం.. ఔషధాలు ఇచ్చేచోట, పరీక్షలు చేసే ప్రాంతాల్లో రోగులు గుంపు గుంపులుగా ఉంటున్నారు. ఎక్కడా కరోనా నిబంధనలు మచ్చుకైనా కానరావడంలేదు. కొందరు రోగులు పేరుకే మాస్క్‌లు ధరించి, గడ్డం మీదకు లాగేస్తున్నారు. ఎడం అనేది ఎక్కడా పాటించడంలేదు. జ్వరం, దగ్గు, జలుబున్నా సరే... ఒకే లైనులో వెళ్లి ఓపీ చీటీలు తీసుకుంటున్నారు. కరోనా బాధితుల్లో దాదాపు 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు బయటకు కన్పించవు. ఇలాంటి వారూ ఇతర ఇబ్బందులతో ఆసుపత్రికి వస్తున్నారు. ఏ ఒక్కరికి కరోనా ఉన్నా.. ఇతరులకు సులువుగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ నిర్లక్ష్య ధోరణి పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
![](https://assets.eenadu.net/article_img/11_750.jpg)
ఉస్మానియా ఆసుపత్రి:
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలకు ఉస్మానియా ఆసుపత్రి ఒక్కటే అందుబాటులో ఉంది. నిత్యం ఇక్కడకు 1500 మందిపైనే రోగులు వస్తున్నారు. 50-80 వరకు సర్జరీలు జరుగుతున్నాయి. ఓపీ నుంచి పరీక్ష కేంద్రాల వరకు అన్ని విభాగాలు రద్దీగా ఉంటున్నాయి. ఒకర్నొకరు నెట్టుకునే పరిస్థితి నెలకొంటోంది. వరండాలు, గదులు ఇరుకిరుగ్గా ఉంటున్నాయి. గాలి, వెలుతురు వచ్చే పరిస్థితి లేదు. మాస్క్‌లు సరిగా ధరించకపోవడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలే ఎక్కువ.
నిలోఫర్ ఆసుపత్రి:
నిత్యం 600-800 మంది వరకు ఓపీ సేవలకు వస్తుంటారు. ఎక్కువగా గర్భిణులు, చిన్న పిల్లలుంటారు. పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా...మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లలకు సీటీస్కాన్, ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు అవసరమైతే ఉస్మానియా ఆసుపత్రికి పంపాలి. అక్కడ రద్దీ నేపథ్యంలో కరోనా బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
నిమ్స్:
ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పెషాలిటీ ఆసుపత్రి అయిన నిమ్స్‌కు ప్రస్తుతం రోజూ 1400 మంది వరకు ఓపీకి వస్తున్నారు. ఎడం మచ్చుకైనా కన్పించడం లేదు. గతంలో ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్ చేశాకే అనుమతించేవారు. సేవల్లో జాప్యం జరుగుతుండడంతో ఈ నిబంధన ఎత్తేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలున్న వారికే స్కానింగ్ చేస్తున్నారు.
ఫీవరాసుపత్రి:
చలి పెరుగుతుండటంతో వైరల్ వ్యాధులు విజృంభించి, రోగుల తాకిడి పెరిగింది. కౌంటర్ల వద్ద జనం గుమిగూడుతున్నారు. ఇక్కడ కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఉంది. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నా సరే... బేఖాతరు చేస్తుండడంతో రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి వద్దా ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిబంధనలు తప్పకుండా పాటించేలా చేయకపోతే కరోనా కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఇదీ చదవండి: దుబ్బాకలో కారును ముంచిన చపాతి రోలర్