రెడ్‌జోన్‌లో లేని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి లోబడి వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. మే 3తో ముగియనున్న లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మే 17 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో కొన్ని ఆంక్షలను సడలించింది.
ఆదాయానికి గండి
దీనిలో భాగంగానే మద్యం దుకాణాలూ తెరవవచ్చని పేర్కొంది. తెలంగాణలో 18 ఆరెంజ్ జోన్లు, 9 గ్రీన్ జోన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ జోన్లలోని మద్యం దుకాణాలు తెరచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. మార్చి 22 నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయి సర్కారు ఆదాయానికి భారీగా గండి పడింది.
మార్గదర్శకాలను పరిశీలిస్తున్న అధికారులు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు సడలింపు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించే పక్షంలో ఇక్కడ కూడా పరిమితంగా అయినా మద్యం దుకాణాలు తెరచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తున్న అధికారులు ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై రాష్ట్రప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు