ఉదయం మూడు గంటల సమయంలో ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థినుల వసతి గృహంలోని స్నానాల గదిలోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. ఆగంతకుడి మాటలు విన్న ఓ విద్యార్థిని..భయంతో గడియ పెట్టుకొని లోపలే ఉండి పోయింది. గమనించిన చొరబాటుదారుడు కత్తి చూపించి అరవొద్దని బెదిరించాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తించాడు.
విద్యార్థిని అరుపులు విన్న తోటి స్నేహితురాళ్లు బయటికి రావటం వల్ల, వారిని కూడా బెదిరిస్తూ మొదటి అంతస్తు నుంచి కిందికి దూకి పారిపోయాడు. బాధిత విద్యార్థిని గది నుంచి సెల్ ఫోన్ తస్కరించాడు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.
వసతి గృహం చుట్టూ సీసీ కెమెరాలు పెట్టండి
మహిళల వసతి గృహంలో కేవలం ముందు భాగంలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. గతంలో కూడా గోడ దూకి హాస్టల్లోకి దూరిన సంఘటనలు ఉన్నాయని విద్యార్థినులు వాపోయారు. హాస్టల్ వెనుక భాగం చెట్ల పొదలతో నిండటం వల్ల గోడ దూకి దుండగులు హాస్టల్లోకి ప్రవేశిస్తారని విద్యార్థినిలు పేర్కొన్నారు. గోడలపై కొన్నిచోట్ల ఫెన్సింగ్ ఊడిపోయి భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇకనైనా చుట్టూ రోడ్డు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా చేపట్టాలని డిమాండ్ చేశారు. .
ఇవీ చూడండి : పథకం ప్రకారం భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త